Kcr Representative Image (Image Credit To Original Source)
BRS: పల్లె పోరులో అంతో ఇంతో సత్తా చాటాం. పురపోరులోనూ పరువు కాపాడుకున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన గ్రేటర్ పరిధిలో మాత్రం రెండు సిట్టింగ్ సీట్లను ఉపఎన్నికల్లో నిలబెట్టుకోలేకపోయాము. ఈసారి ఇక రూట్ మార్చాల్సిందే. గ్రేటర్ మీద పట్టు సాధించాల్సిందే. ఇందుకోసం పూర్తిగా GHMC ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయింది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ. గ్రేటర్ పరిధిలో కొత్తగా ఏర్పాటైన మూడు కార్పొరేషన్లకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తిరిగి జెండా పాతాల్సిందేనని ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ చేస్తోందట కారు పార్టీ. బీఆర్ఎస్ అప్పుడే గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ చేయడానికి రీజనేంటి? ఈ ఎన్నికల్లో గెలుపోటములు బీఆర్ఎస్‌పై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి?
త్వరలోనే జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై అప్పుడే స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రతిపక్ష బీఆర్ఎస్. బల్డియా ఎన్నికల్లో కచ్చితంగా తమదే పైచేయి కావాలని కసి మీదుంది. తెలంగాణకు గుండె లాంటి గ్రేటర్ హైదరాబాద్ లో వన్ థర్డ్ అసెంబ్లీ సీట్లు ఉంటాయి. పైగా డీలిమిటేషన్ జరిగి సీట్ల సంఖ్య పెరిగితే కూడా గ్రేటర్ పరిధిలో కొత్త నియోజకవర్గాలు సంఖ్య మరింత పెరుగనుంది. దీంతో GHMCతో పాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోందట గులాబీదళం.
గ్రేటర్‌పై పట్టు కోల్పోతే మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని భావిస్తున్నారట గులాబీబాస్ కేసీఆర్. అందుకే GHMC ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే పూర్తి ప్రిపరేషన్‌లో పడిపోయిందట కారు పార్టీ. ఎక్కడిక్కడ లీడర్లను అలర్ట్ చేసి..ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జ్‌లను అప్రమత్తం చేసి రెగ్యులర్‌గా ఫీల్డ్‌లోనే ఉండాలని సూచించారట పార్టీ పెద్దలు. మరో వారం, పది రోజుల్లో ఇంచార్జ్‌లను కూడా ప్రకటించి ఇప్పటినుంచే క్షేత్రస్థాయిలో పనిచేసేలా వ్యూహరచన కూడా రెడీ చేస్తున్నారట. గ్రేటర్ ప్రజల్లో ప్రభుత్వం మీదున్న వ్యతిరేకత, గతంలో తమ సర్కార్ హయాంలో చేసిన అభివృద్ధి, మళ్లీ అధికారంలోకి వస్తే చేసే పనులను ప్రజలకు వివరించి..GHMCలో తిరిగి పాగా వేయాలని భావిస్తున్నారట గులాబీ లీడర్లు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ, హైదరాబాద్ నగర పరిధిలో మాత్రం బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 24 అసెంబ్లీ స్థానాలకు గాను బీఆర్ఎస్ అత్యధికంగా 15 ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ గెలుపొందింది. అంతే కాకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికీ బీఆర్ఎస్ కు 12 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో వారిదే పైచేయిగా ఉంది.
ఇక 2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 150 డివిజన్లకుగాను 99 డివిజన్లలో గెలుపొంది రికార్డు నెలకొల్పింది. 2020 వచ్చేసరికి 56 కార్పొరేట్ సీట్లను సొంతం చేసుకుని ఎంఐఎంతో కలిసి మేయర్ సీటును కైవసం చేసుకుంది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లోను తమకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. విభజిత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాస్త ఎంఐఎంకు ఎడ్జ్ ఉండే అవకాశం ఉన్నా..సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్లలో మాత్రం..తమకు గెలుపు అవకాశాలు ఉంటాయని లెక్కలు వేసుకుంటున్నారట.
సైబరాబాద్ పరిధిలో తాము చేసిన అభివృద్ధి, మల్కాజ్ గిరి పరిధిలో చేసిన డెవలప్ మెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పక్కా ప్లాన్ చేస్తున్నారట. గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అందుకు సిద్దంగా ఉండాలని, గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటి నుంచే గ్రేటర్ ఎన్నికలకు సన్నద్దం అవుతున్నట్లు సమాచారం. మొత్తానికి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు వయా గ్రేటర్ రూట్ మ్యాప్ ప్లాన్ చేస్తోంది గులాబీదళం.