Gossip Garage : బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా సీఎం స్లోగన్స్.. కేటీఆర్, కవిత ఎందుకు వారించడం లేదు? కారు పార్టీలో అసలేం జరుగుతోంది?

సాధారణ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది. మరి సమయం, సందర్భం లేకుండా కేసీఆర్ నుంచి మొదలు కేటీఆర్, కవిత..ఎవరు కనిపించినా సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశమవుతోంది.

Gossip Garage : అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అవును మన మనసులో ఉన్న మాటను పక్కోడి నోటి నుంచి వింటే ఆ ఆనందమే వేరు. రాజకీయ నాయకులకు అయితే ఇంకా ఖుషీ. సీఎం.. సీఎం.. స్లోగన్ వింటే ఏ పొలిటికల్‌ లీడర్‌ అయినా మెసర్మైజ్‌ అయిపోతాడు. మెహంపై చిరునవ్వు వెలిగిపోవాల్సిందే. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్‌లో మాత్రం సీఎం అనే నినాదం గమ్మత్తుగా మారిందట. కేసీఆర్ నుంచి కవిత వరకు ఎవరు కనిపించినా కార్యకర్తలు సీఎం అని స్లోగన్స్ చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ కారు పార్టీలో ఏం జరుగుతోంది? సీఎం నినాదం చిరాకు పుట్టిస్తుందా.. అగ్గి రాజేస్తుందా.?

బీఆర్ఎస్ పార్టీని తెగ ఇబ్బంది పెడుతున్న సీఎం స్లోగన్..
బీఆర్‌ఎస్‌ మళ్లీ పవర్‌లోకి వస్తే సీఎం అయ్యేదవరని అడిగితే.. అందరూ టక్కున చెప్పేది కేసీఆర్ పేరే. కేసీఆర్ తర్వాత ఎవరంటే కేటీఆర్ పేరో..హరీశ్‌ రావు పేరో చెప్పడం కామన్. కానీ పార్టీ పవర్‌లో లేకున్నా..సీఎం..సీఎం అంటూ కార్యకర్తలు చేస్తున్న స్లోగన్స్‌ కారులో కాక పుట్టిస్తున్నాయట. సీఎం.. మాజీ సీఎం కేసీఆర్ నుంచి మొదలు కేటీఆర్, కవిత వరకు ఎవరు కనిపించినా కార్యకర్తల నోట సీఎం..సీఎం అంటూ నినాదాలు వస్తుండటం చర్చనీయాంశం అవుతోందట. ఓ రకంగా సీఎం అన్న పదం బీఆర్ఎస్ పార్టీకి తెగ ఇబ్బంది పెడుతోందట.

ముఖ్యమంత్రి స్థాయి నాయకులు, లేదంటే భవిష్యత్‌లో కచ్చితంగా సీఎం అవుతారన్న నేతలు కనిపించినప్పుడు కార్యకర్తలు సహజంగానే సీఎం..సీఎం అంటూ నినాదాలు చేయడం కామన్. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఏ సమావేశానికి, సభకు వెళ్లినా సీఎం.. సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు.

Also Read : అధికారుల తీరు వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు, వాళ్లే కోవర్టులు, చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది- మధుయాష్కీ సంచలనం

అసలు కారు పార్టీలో ఏం జరుగుతోంది?
కేటీఆర్, కవిత ఎప్పుడో ఓ అప్పుడు కచ్చితంగా సీఎం అవుతారనో.. లేదంటే కావాలనో క్యాడర్ ఉద్దేశ్యం కావొచ్చు. ఇంతవరకు బాగానే ఉన్నా..ఇలా కేటీఆర్, కవిత కనిపించినప్పుడు సీఎం..సీఎం అంటూ నినాదాలు చేస్తున్న కార్యకర్తలను వాళ్లిద్దరు ఏ మాత్రం మందలించకపోవడమే ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. దీంతో అసలు కారు పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది.

కేసీఆర్ తీవ్ర అసహనం..
కార్యవర్గ సమావేశం కోసం తెలంగాణ భవన్‌కు వచ్చిన గులాబీ దళపతి కేసీఆర్‌ను చూసిన కార్యకర్తలు సీఎం, సీఎం అంటూ పెద్ద ఎత్తున స్లోగన్స్‌ చేశారు. ఒక్కసారిగా సీఎం నినాదాలతో హోరెత్తించారు. దీంతో కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరికి.. ఒర్లకండిరా బాబూ..దండం పెడతానంటూ కేసీఆర్ వారించాల్సి వచ్చింది.

అయితే కేసీఆర్‌ యాక్టీవ్‌ పాలిటిక్స్‌లో ఉండగానే అదే కుటుంబం నుంచి మిగతా ఇద్దరూ కేటీఆర్, కవిత సభలు, సమావేశాల్లో సీఎం నినాదాలేంటన్నదే బీఆర్ఎస్‌లో చర్చ. అదీ కాకుండా సాధారణ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది. మరి సమయం, సందర్భం లేకుండా కేసీఆర్ నుంచి మొదలు కేటీఆర్, కవిత..ఎవరు కనిపించినా సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశమవుతోంది.

కేసీఆర్ సంగతి పక్కనపెడితే తమను ఉద్దేశించి సీఎం..సీఎం అంటూ నినాదాలు చేస్తున్న వాళ్లను కేటీఆర్, కవిత వారించకపోవడమే ఆసక్తికరంగా మారుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కార్యకర్తలు వాళ్లంతట వాళ్లే నినాదాలు చేస్తున్నారా..లేక తెరవెనుక కథ వేరే ఉందా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి.

Also Read : ఎనీ సెంటర్.. నేను రెడీ.. దమ్ముందా..! విపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..

కేటీఆర్, కవిత క్యాడర్‌ను ఎందుకు వారించడం లేదు?
సమయం, సందర్భం లేకుండా సీఎం..సీఎం అని నినాదాలు చేసిన నేతలు, కార్యకర్తలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒకటి రెండుసార్లు కార్యకర్తలపై సీరియస్ అయ్యారు. కానీ కేటీఆర్, కవిత మాత్రం క్యాడర్‌ను ఎందుకు వారించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ విషయంలో క్లారిటీ లేకపోతే కార్యకర్తల్లోనే కాదు..పార్టీ సీనియర్ నేతల్లో కూడా గందరగోళానికి దారితీస్తుందన్న టాక్ వినిపిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని, మళ్ళీ కేసీఆరే సీఎం అవుతారని ఓవైపు చెబుతూనే..కవిత, కేటీఆర్‌ తమ సమావేశాల్లో సీఎం స్లోగన్స్‌ను కట్టడి చేయకపోవడం వెనుక ఆంతర్యమేంటన్న డిస్కషన్ జరుగుతోంది. బీఆర్ఎస్‌లో సీఎం స్లోగన్స్‌ రచ్చ రాబోయే రోజుల్లో ఎటువైపు దారి తీస్తుందో చూడాలి మరి.