Madhu Yaskhi Goud : అధికారుల తీరు వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు, వాళ్లే కోవర్టులు, చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది- మధుయాష్కీ సంచలనం
సింగరేణిలో కవితకు అన్ని రకాలుగా సహకరించిన అధికారి.. మా ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ చాలా చోట్ల ఉంది.

Madhu Yaskhi Goud : గత ప్రభుత్వంలో అధికారం చెలాయించిన అధికారులే ఇప్పుడు పెత్తనం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ అన్నారు. అధికారుల తీరు వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని వాపోయారు. సోమేశ్ కుమార్ బాగోతం ఇంకా బయటపడాలన్నారు. సోమేశ్ కుమార్ అండతోనే జీఏస్టీ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు.
దోచిపెట్టిన, దాచిపెట్టిన అధికారులపై విచారణ జరగాలన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేసిన అమెయ్ కుమార్ లాంటి వారిపై చర్యలు అవసరం అన్నారు మధుయాష్కీ. హైదరాబాద్ గాంధీభవన్ లో చిట్ చాట్ లో మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
”కొన్ని కేసుల్లో విచారణలో వేగం లేనందునే కాంప్రమైజ్ అయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. విచారణ చేయాల్సిన అధికారులే దోషులు కావడంతో విచారణ ముందుకు సాగడం లేదు. సింగరేణిలో కవితకు అన్ని రకాలుగా సహకరించిన అధికారి.. మా ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ చాలా చోట్ల ఉంది.
రాజకీయ లబ్ది కోసం ఈడీ, సీబీఐలను బీజేపీ వాడుకుంది. గత ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో పోలీసులతో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల డబ్బులు పంచారు. ఒక సీఐకి 2 లక్షలు ఇచ్చి అతడిని సైలెంట్ గా ఉంచి డబ్బులు పంచారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ అవినీతి బయటపడకుండా మొత్తం అధికార వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. సీఎం దగ్గర సమాచారం అంతా ఉంది. అందుకే ట్రాన్స్ ఫర్లు జరుగుతున్నాయి. అవినీతి అధికారుల లిస్ట్ సీఎం దగ్గరికి చేరింది. సంధికాలం ముగిసింది. చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని పక్కన పెట్టాలి. ఇప్పుడు కూడా గతంలో పని చేసిన వారే కీ పోస్టుల్లో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ తో కుమ్మక్కై ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తున్నారు.
Also Read : ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
పోలీస్ వైఫల్యంతోనే రాజలింగమూర్తి హత్య జరిగింది. గత ప్రభుత్వంలో అధికారం చెలాయించిన అధికారులే ఇంకా పెత్తనం చెలాస్తున్నారు. వాళ్లే కోవర్టులుగా ఉన్నారు. అధికారులే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దోచి పెట్టి, దాచి పెట్టడానికి సహకరించిన అధికారులు ఇంకా చెలాయిస్తున్నారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు మధుయాష్కీ గౌడ్.