Land Scam Vs Formula E Car Race: తెలంగాణ పాలిటిక్స్ ఎప్పుడూ నెక్స్ట్ ట్రెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఫార్ములా ఈ కారు రేస్ పాతదే. కాకపోతే సరికొత్త అలిగేషన్స్‌తో కాక రేపుతోంది. ఇక రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు కొత్తేమీ కాదు. ఈసారి మాత్రం ఏకంగా రూ.5లక్షల కోట్ల విలువైన భూములను కొట్టేసే కుట్రకు తెరలేపారని బీఆర్ఎస్ ఒంటి కాలిపై లేస్తోంది. సరిగ్గా స్థానిక ఎన్నికల వేళ కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వడం..కౌంటర్‌గా బీఆర్ఎస్ భూస్కామ్ అంటూ రచ్చ చేస్తుండటం చర్చకు దారి తీస్తోంది.
హైదరాబాద్‌లో భారీగా భూకుంభకోణం జరుగుతోందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. బాలానగర్, నాచారం, జీడిమెట్లలో 9,292 ఎకరాల భూస్కామ్‌కు ప్రభుత్వం తెరలేపిందని కేటీఆర్ ఆరోపణలు చేశారు. రూ.5 లక్షల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా..కాంగ్రెస్ సర్కార్ ఇస్తున్న మినహాయింపుతో ప్రభుత్వానికి 5వేల కోట్ల ఆదాయమే వస్తుందని చెబుతోంది బీఆర్ఎస్. ఆ భూములను సీఎం రేవంత్ రెడ్డి అనుచరులకు, బంధువులకు ఇచ్చేందుకు ప్రయత్నం జరుగుతోందని అలిగేషన్స్ చేస్తున్నారు.
ఇక అటు ఫార్ములా ఈ కారు రేస్ కేసులో..కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిసినట్లేనని కాంగ్రెస్ లీకులు ఇస్తోంది. కేవలం రూ.55 కోట్ల నిధుల వ్యవహారమే కాదు..ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రైవేటు డిస్కషన్లతో రేస్ పెట్టారని అలిగేషన్స్ చేస్తున్నారు. క్విడ్ ప్రోకో జరిగిందని..ట్రై పార్టీ అగ్రిమెంట్‌కు ముందే ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి రూ.44 కోట్ల విలువైన ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారు. సేమ్ టైమ్ ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే చెల్లింపులు, అగ్రిమెంట్లు చేసి కోడ్‌ను ఉల్లంఘించినట్లు చెప్పుకొస్తున్నారు. అయితే అంతా నిబంధనల ప్రకారమే చేశాం..బీఆర్ఎస్‌కే కాదు అన్ని పార్టీలకు ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చిందని.. అందులో క్విడ్ ప్రోకో ఏం లేదని బీఆర్ఎస్ చెప్పుకొస్తోంది. ఈ క్రమంలో భూ స్కామ్ వర్సెస్ ఈ కారు రేస్ కేసు డైలాగ్ వార్..స్థానిక ఎన్నికలకు ముందు తెలంగాణ పాలిటిక్స్‌ను హీటెక్కిస్తోంది.
అయితే ఫార్ములా ఈ కారు రేస్ కేసులో తనను అరెస్ట్ చేసే ధైర్యం.. రేవంత్ చేయరని కేటీఆర్ చెప్పడం చర్చకు దారితీస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అంటున్న కేటీఆర్..ఫుల్ కాన్ఫిడెన్స్‌తో లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. అయితే ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా మారబోతున్నాయన్నది డిబేట్ పాయింట్‌గా మారింది. స్థానిక ఎన్నికల వేళ కేటీఆర్ జైలుకు వెళ్లాల్సి వస్తే నష్టమెవరికి? లాభమెవరికి? అన్న చర్చ నడుస్తోంది. అవినీతి సంగతి పక్కన పెడితే రూ.45 కోట్ల వ్యవహారంలో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే అది ఆయనకు సానుభూతిగా మారుతుందన్న టాక్ వినిపిస్తోంది.
అరెస్ట్ అయితే.. సానుభూతి పెరిగి అడ్వాంటేజ్?
స్థానిక ఎన్నికల వేళ కేటీఆర్ అరెస్ట్ అయితే..ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి పెరిగి బీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్‌గా మారొచ్చన్న ఊహాగానాలు నడుస్తున్నాయి. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే..ఆ పార్టీ ధర్నాలు, నిరసనలు చేస్తే..లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కే మైలేజ్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఎంత అవినీతి జరిగిందన్నది ప్రజలు పట్టించుకోరని, అవినీతి జరిగిందా.? లేదా.? అన్నది మాత్రమే ప్రజలు చూస్తారనేది కాంగ్రెస్ వాదన. దానికి విరుగుడుగానే.. బీఆర్ఎస్ భూస్కామ్‌ను తెరమీదకు తెచ్చిందని అంటున్నారు. లోకల్ పోరు వేళ ఈ కారు రేస్ Vs భూస్కామ్ వార్ ఎటు టర్న్ తీసుకుంటుందో? ఎవరికి ఎంత ఇమేజ్‌ను తీసుకొచ్చి పెడుతుందో? చూడాలి.