GHMCలో వార్డుల డీలిమిటేషన్‌పై గందరగోళం.. సర్కార్‌కు సవాళ్లు

ఏ వార్డులో ఎంత జనాభా ఉంది అన్న అంశంలో స్పష్టత లేకపోవడంతో బీజేపీ డీలిమిటేషన్‌ను తప్పుబడుతుంది.

GHMCలో వార్డుల డీలిమిటేషన్‌పై గందరగోళం.. సర్కార్‌కు సవాళ్లు

GHMC

Updated On : December 11, 2025 / 9:36 PM IST

GHMC: అదేదో సినిమాలో ఏదో మ్యాప్ ముందు పెట్టుకుని ముక్కలుముక్కలు చేసి పంచుకున్న సీన్ గుర్తుస్తోంది గ్రేటర్‌లోని వార్డుల విభజన చూస్తే. ఓ ప్రాతిపదిక అంటూ లేకుండా గ్రేటర్ మ్యాప్ ముందు పెట్టుకుని గీతలు గీస్తూ వార్డుల విభజన చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. GHMCని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాలన మొత్తం బల్దియా ఆధ్వర్యంలోకి వచ్చింది.

వార్డుల పునర్విభజన చేసిన అధికారులు 150 నుంచి 300 వార్డులకు పెంచారు. ఈనెల 9వ తేదీ నుంచి అధికారికంగా ఏడు రోజులపాటు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అయితే వార్డుల విభజన మ్యాపులు..జనాభా లెక్కలు ఏవీ పరిగణనలోకి తీసుకోకుండా తోచినట్లు విభజన చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. ఓల్డ్‌ సిటీలో ఎంఐఎంకు అనుకూలంగా వార్డులను విభజించారంటూ బీజేపీ ఆరోపిస్తోంది.

గ్రేటర్‌లో 20 మున్సిపాలిటీలు..ఏడు కార్పొరేషన్ల విలీనం తర్వాత..GHMCని మూడు విభాగాలు డివైడ్ చేస్తారని టాక్ నడిచింది. కానీ అందరి అంచనాలకు విరుద్దంగా..GHMCలో 150 వార్డులను 3వందలకు పెంచింది సర్కార్. అయితే వార్డుల విభజనపై రాజకీయ పార్టీలు గుర్రుగా ఉన్నాయి. వార్డుల విభజనపై ఎంఐఎం శాసనసభ్యులు, కార్పొరేటర్లు అక్బరుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో కమిషనర్‌తో భేటీ అయ్యారు. తమ ప్రాంతాల్లోని పలు వార్డుల విభజనపై వారు కమిషనర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదులు చేశారు.

Also Read: ఆ మున్సిపల్ పీఠం టీడీపీ వశం.. ఎమ్మెల్యే సురేంద్రబాబు వ్యూహం ఫలించిందా? కడపలో మాత్రం వైసీపీ ఖాతాలోనే మేయర్ పీఠం

వార్డ్ హద్దులు క్లియర్‌గా లేవనేది రాజకీయ పక్షాల వాదన. ప్రధానంగా సెంట్రల్ సిటీలో వార్డుల సంఖ్య కొంత పెరిగింది. ఇక విలీన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఒకటి రెండు వార్డులుగా మాత్రమే విభజించారు. అయితే ఇందులో జనాభాను ప్రాతిపదికగా తీసుకొని వార్డుల విభజన చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ ఆ అంశంలో క్లారిటీ లేదట. మరోవైపు నాచురల్ బౌండరీస్ అనుసరించి వార్డును విభజించామని అధికారులు చెబుతున్నారు. వాటి విషయంలోనూ లోకల్ లీడర్లకు క్లారిటీ రావడం లేదు. తమ డివిజన్‌లో తమకే తెలియని నేచురల్ బౌండరీస్‌ను అధికారులు గుర్తించి పేర్కొనడంతో నోరువెళ్లబెట్టడం కార్పొరేటర్ల వంతు అవుతోంది.

వైశాల్యాన్ని బట్టి చేశారా? జనాభాను బట్టి చేశారా?
వార్డుల విభజన వైశాల్యాన్ని బట్టి చేశారా జనాభాను బట్టి చేశారా అన్నదానిపై క్లారిటీ లేదు. ఈ విషయంలో డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులకు కూడా క్లారిటీ లేకపోవడంతో..వారు కార్పొరేటర్లు, పొలిటికల్ లీడర్లు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారట. అటు కొత్తగా వచ్చిన కమిషనర్‌ కూడా క్లారిటీ ఇవ్వలేక ఎవరికీ అందుబాటులోకి రావడం లేదంటున్నారు పలువురు కార్పొరేటర్లు.

ఏ వార్డులో ఎంత జనాభా ఉన్నారు..? ఏ వార్డు వైశాల్యం ఎంత.? అనేది చెప్పేవారే లేరట. పైగా వార్డ్ బౌండరీలను ఈజీగా గుర్తించేలా మ్యాపులను కూడా విడుదల చేయలేదు. దాంతో డీలిమిటేషన్‌పై గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది. వార్డుల బౌండరీల విషయంలో రెండు మూడుసార్లు మార్పులు చేర్పులు జరిగినట్లు టాక్. కొందరు రాజకీయ నేతల ఒత్తిడితోనే వార్డుల హద్దులను మార్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక పాత GHMC పరిధిని..విలీన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోకి రాకుండా..బల్ధియా అధికారులు జాగ్రత్త పడ్డట్లు కనిపిస్తుంది. ఉప్పల్ సర్కిల్ పరిధిలోని డివిజన్లను అదే ప్రాంతంలో పునర్విభజన చేశారు. పక్కనే ఉన్న బోడుప్పల్, ఫీర్జాదిగూడ కార్పొరేషన్ల పరిధిలో గతంలో 58 వార్డులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఫిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో రెండు వార్డులు..బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో రెండు వార్డులను మాత్రమే ఏర్పాటు చేశారు. అంటే అప్పటికే ఉన్న లోకల్ బాడీల పరిధిలో మాత్రమే ఈ విభజన జరిగింది తప్ప అన్నింటిని ఒక్క దగ్గరకి చేర్చి విభజించలేదన్న వాదన వినిపిస్తోంది.

మరోవైపు ఇప్పటికే ఉన్న ఆరు జోన్ల పరిధిలో ఉన్న వార్డుల సంఖ్య ఎంత పెరిగింది..ఏయే వార్డు రెండు వార్డులుగా విభజన అయిందన్న అంశాలపై క్లారిటీ లేదు. ఏ వార్డులో ఎంత జనాభా ఉంది అన్న అంశంలో స్పష్టత లేకపోవడంతో బీజేపీ డీలిమిటేషన్‌ను తప్పుబడుతుంది. వార్డుల విభజన మ్యాపులు లేకపోవడంతో తమ అభ్యంతరాలను సూచనలను చెప్పేందుకు ఆస్కారం లేకుండా పోతుందనేది రాజకీయ పార్టీల వాదన. అయితే పొలిటికల్ ప్రెజర్ వల్లే అధికారులు వార్డుల మ్యాప్‌లు, బార్డర్లలో విషయంలో ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. డీలిమిటేషన్ గందరగోళానికి ప్రభుత్వం ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి మరి.