Election Commission: మీ ఓటును ఇంకెవరో వేస్తే టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి..
మీకు టెండర్ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఎన్నికల నియమావళి 1961, సెక్షన్ 49పీ ప్రకారం మీకు ఈ అవకాశం దక్కుతుంది.
Local Body Polls: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ మీరు ఓటువేయడానికి వెళ్తే.. అప్పటికే మీ ఓటును వేరే వారు వేసి వెళ్లిపోయారని తెలిసిందా? లేదంటే మీకు తెలిసిన వారి ఓటును మరొకరు వేసి వెళ్లారా? అలాంటి దొంగ ఓట్లు పడ్డప్పటికీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే.. ఇలాంటి దొంగ ఓట్లు నమోదైతే నిజమైన ఓటర్‌కు మరో అవకాశం కల్పించేందుకు టెండర్ ఓటింగ్ ఉంది. మీకు ప్రిసైడింగ్ అధికారి ఈ అవకాశం కల్పిస్తారు. (Local Body Polls)
మీ ఓటును ఉద్దేశపూర్వకంగా మరొకరు వేస్తే దొంగ ఓటు అంటారు. అయితే, పల్లెల్లో కొందరు తెలియక లేదంటే బూత్ ఏజెంట్లు, అధికారుల పొరపాటు వల్ల కూడా ఒకరి ఓటును మరొకరు వేస్తుంటారు. అందుకే, ఇటువంటి వేళ నిజమైన ఓటరుకి ఎన్నికల సంఘం కల్పించే అవకాశమే టెండర్ ఓటు.
మీరు పోలింగ్ కేంద్రానికి వెళ్లకముందే మీ పేరుతో వేరే వ్యక్తి ఓటు వేస్తే పోలింగ్ అధికారిని సంప్రదించండి. మీకు టెండర్ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఎన్నికల నియమావళి 1961, సెక్షన్ 49పీ ప్రకారం మీకు ఈ అవకాశం దక్కుతుంది.
Also Read: Modi : చంద్రబాబు పాలనపై మోదీ ప్రశంసలు.. తెలంగాణలో బీజేపీ వెనుకబడిందన్న ప్రధాని..
పోలింగ్ బూత్‌లోని ప్రిసైడింగ్ అధికారిని మీరు కలిసి నిజమైన ఓటరు మీరేనని ఆధారాలు చూపండి. మీ ఓటరు కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులు చూపండి. వాటిని అధికారి పరిశీలించి, టెండర్ ఓటు వేయడానికి మీకు ఛాన్స్ ఇస్తారు. ఫాం 17బీలో మీ పేరు, వివరాలు, సంతకం తీసుకుంటారు.
టెండర్ ఓటుకు బ్యాలెట్ పేపర్ బండిల్లో చివరిది ఇస్తారు. అందులోని అభ్యర్థుల్లో మీరు ఎంచుకున్న వారి గుర్తుపై ఎక్స్ గుర్తు వేయాలి. ఆ తర్వాత దాన్ని మడతపెట్టి అధికారికి ఇవ్వాలి. దాన్ని అధికారి పోస్టల్ ఓట్లలా సీల్ చేసి భద్రపరిచి, ఓట్ల లెక్కింపు వేళ గెలుపు, ఓటమి తేడా వస్తే టెండర్ ఓట్లను లెక్కిస్తారు.
ఒకవేళ 30 ఓట్ల మెజార్టీ వచ్చి కేవలం 5-6 టెండర్ ఓట్లు వస్తే వాటిని లెక్కించరు. కాగా, భద్రాచలం గ్రామ పంచాయతీ 11వ నంబర్ పోలింగ్ బూత్‌లో కోటగిరి లక్ష్మి అనే మహిళ ఇవాళ టెండర్ ఓటింగ్ వేశారు.
