Telangana Congress: కాంగ్రెస్‌లో కలహాలు కామన్. ఓ నేత అంటే మరో లీడర్‌కు పడదు. ఇంకో నాయకుడి ఎదుగుదలను మరొక నేత డైజెస్ట్ చేసుకోలేరు. ఇక పవర్‌లోకి వచ్చాక ఈ గొడవ ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల వేళ.. ఇంటి పోరు హస్తం పార్టీకి హెడెక్‌గా మారిందట. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నల్గొండ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఆధిపత్య పోరు..సర్పంచ్ ఎన్నికల్లో పోటీనే మార్చేసిందట. ఏ ఊరికి వెళ్లినా కనీసం ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ ఉండటంతో.. ఎక్కడ తమ పుట్టి మునుగుతుందేమోనని టెన్షన్ పడుతున్నారట హస్తం పార్టీ పెద్దలు.
అధికార హస్తం పార్టీకి నల్గొండ జిల్లా కంచుకోట. 12 అసెంబ్లీ సీట్లు ఉంటే ఒక్క సూర్యాపేటలో మినహా మిగతా 11 సీట్లను తన ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్ పార్టీ. జిల్లాలో కీలక పదవులన్నీ కాంగ్రెస్ నేతల చేతుల్లోనే ఉన్నాయి. చాలా ముఖ్యమైన పంచాయతీ ఎన్నికల్లోనే హస్తం పార్టీకి అసలు సమస్య వచ్చి పడిందట. ఇన్నాళ్లుగా లీడర్ల మధ్య నడిచిన కోల్డ్ వార్ కాస్త.. వర్గపోరుగా మారి..రచ్చకెక్కి ఇంటిపోరును రోడ్డున పడేస్తుందట. ఇప్పటికే పాత, కొత్తగా విడిపోయిన అధికార పార్టీ నేతలు పార్టీలో కుంపటి పెట్టారట. జరుగుతున్న పరిణామాలు తెలుస్తున్నా..నోరెత్తలేని పరిస్థితుల్లో ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారని ఆ పార్టీ సీనియర్ లీడర్లే చెబుతున్నారు. ముఖ్యంగా జనరల్ స్థానాల్లో ఇటువంటి ఇంటి పోరు ఎక్కువగా ఉందని అంటున్నారు హస్తం నేతలు.
ఆధిపత్య పోరుతో పల్లె పోరు అధికార హస్తం పార్టీకి చెమటలు పట్టిస్తోందట. ఉమ్మడి జిల్లాలో దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తే దాదాపు అన్నిచోట్ల పోటీ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే ఉంటోందట. హస్తం పార్టీ లీడర్లే వర్గాలుగా విడిపోయి పోటీ పడుతున్నారట. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఒరిజినల్ కాంగ్రెస్..వలస కాంగ్రెస్ లీడర్ల మధ్య గట్టి ఫైట్ నడుస్తోందట. సీనియర్ కాంగ్రెస్ నేతల అనుచరులు కూడా రంగంలోకి దిగడంతో బుజ్జగింపులు కత్తి మీద సాములాగా మారాయంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు బుజ్జగించినా పెద్దగా ఫలితం ఇవ్వకపోవడంతో తలలు పట్టుకున్నారట.
తమ నేతల మధ్య పోటీ ఎక్కడ విపక్షాలకు మేలు చేస్తుందోనన్న టెన్షన్ అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోందట. పైకి మాత్రం ఎవరు గెలిచినా తమ పార్టీ వారే కదా అంటున్నప్పటికీ..ఇంటిపోరు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం తాను బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గానికి చెందిన వారు కూడా నామినేషన్లు వేశారట.
మొదటి దశ పోలింగ్ జరిగే మెజార్టీ పంచాయతీల్లో దాదాపుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులే బరిలో ఉన్నారట. రాజకీయంగా ప్రభావం చూపే సర్పంచ్ ఎన్నికల్లో మంత్రి అనుచరులు బరిలో నిలవడంతో నకిరేకల్ హస్తం రాజకీయం వేడెక్కుతోంది. మార్కెట్ కమిటీల నియామకం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం బలంగా ఉంది. అటు మంత్రి, ఇటు ఎమ్మెల్యే కావడంతో సీనియర్ నేతలు కూడా తమకు ఎందుకొచ్చిన లొల్లి అని మౌనంగా ఉంటున్నారట.
మంత్రి అండ చూసుకొని కొందరు గ్రామ, మండల స్థాయి నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే వేముల వీరేశం అసహనంగా ఉన్నారట. మంత్రి కూడా నో డిస్కషన్స్..మన మనుషులు బరిలో ఉండాల్సిందేనని పట్టుబట్టడంతో పలు చోట్ల పోటీ తప్పలేదని అంటున్నారు. అటు మంత్రి, ఇటు ఎమ్మెల్యే వ్యూహాలకు పదును పెడుతుండటంతో నకిరేకల్ కాంగ్రెస్ రాజకీయం వేడుక్కుతోంది. ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గీయులు, దివంగత నేత దామోదర్ రెడ్డి వర్గీయులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. నియోజకవర్గంలో బరిలో ఉన్నవారిలో ఎక్కువ మంది తమ పార్టీ వాళ్లేనని హస్తం పార్టీ నేతలే చెప్తున్నారు.
కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్‌గా విడిపోయిన క్యాడర్..ఎవరికి వారు నామినేషన్లు వేశారు. నియోజకవర్గంలోని 90శాతం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సపోర్టర్సే బరిలో ఉన్నారుట. పలుచోట్ల ముగ్గురు కాంగ్రెస్ మద్ధతుదారులు పోటీలో ఉండటంతో క్యాడర్ తలలు పట్టుకుంటున్నారట. ఓవైపు ఎమ్మెల్యే వర్గం, మరోవైపు దామోదర్ రెడ్డి వర్గంగా విడిపోయి ఎవరికి వారు పోటీ చేస్తుండడంతో ఎవరికి ఎవరు నచ్చచెప్పాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందట.
సూర్యాపేట నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి వర్గంగా విడిపోయి బరిలో నిలిచారు. ఇక మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చెందిన హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లోనూ పలుచోట్ల సొంత పార్టీ నేతలే పోటీ పడుతుండటం ఆశ్చర్యంగా మారింది. మొదటి నుంచి పార్టీని నమ్ముకొని పనిచేస్తే..రాకరాక ఈ సారి అవకాశం వచ్చిందని..సమీకరణాల పేరుతో కొత్తవారికి టికెట్ ఇస్తున్నారంటూ పాత క్యాడర్ తీవ్ర ఆందోళనకు గురవుతోందట.
మిర్యాలగూడలో కూడా పలు గ్రామాల్లో అధికార పార్టీ నేతల మధ్యే హోరాహోరీ పోరు కొనసాగుతోంది. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కాకపోవడం..ఎవరు గెలిచినా తమ పార్టీనే కదా అన్న ధీమాతో ఎమ్మెల్యేలు పలుచోట్ల పల్లె పాలిటిక్స్ జోలికి పోవడం లేదు. ఎవరు గెలిచినా పార్టీకి నష్టం లేదని ఎమ్మెల్యేలే అంటున్నారట. అయితే ముఖ్యనేతలను నమ్ముకొని పోటీ చేసి ఆర్థికంగా నష్టపోతే తమ పరిస్థితి ఏంటని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారట.
మరోవైపు అధికార పార్టీ అన్న తర్వాత ఆశావహులు ఎక్కువగా ఉంటారని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇదే అదనుగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో తమ మద్ధతుదారులను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది. పలుచోట్ల వామపక్ష పార్టీలతో అవగాహన కుదుర్చుకుంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు గులాబీ లీడర్లు.
Also Read: సల్మాన్ ఖాన్ తో సీఎం రేవంత్ రెడ్డి.. ఫొటోలు వైరల్.. ఎప్పుడు ఎక్కడ కలిశారంటే..?