సై అంటే సై అంటున్న సీనియర్లు..! హస్తం పార్టీలో హీట్ పుట్టిస్తున్న యూత్ కాంగ్రెస్ ఎన్నికలు

ఒక జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ పదవికి ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో సీనియర్‌ నేత తీవ్రంగా ప్రయత్నాలు చేయడంపై కాంగ్రెస్‌ పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. పైగా ముగ్గురూ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఇతర ఎమ్మెల్యేల సహకారం కోరుతుండటం పార్టీలో ఆసక్తి రేపుతోంది.

Gossip Garage : యూత్‌ కాంగ్రెస్‌ ఎన్నికలు కాంగ్రెస్‌లో హీట్‌ పుట్టిస్తున్నాయి. రాజకీయ వారసత్వం కోసం ఆరాటపడుతున్న యువనేతలు తమకు మద్దతుగా తండ్రులను రంగంలోకి దింపడంతో పోరు ఆసక్తికరంగా మారుతోంది. ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు సై అంటే సై అంటుండంతో కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయం రసవత్తరంగా మారుతోందంటున్నారు. పార్టీలో చిన్న పదవే అయినా, నేతలు ప్రతిష్టకు తీసుకోవడమే చర్చకు తావిస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో సీనియర్‌ నేత మధ్య ఆసక్తికరంగా మారింది యువ పోరు.

కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఇదో కొత్త రకమైన పోరు..
కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఇదో కొత్త రకమైన పోరు. యూత్‌ కాంగ్రెస్‌ ఎన్నికలు ముగ్గురు సీనియర్‌ నేతలకు పరీక్షగా మారాయి. తనయులను గెలిపించుకోవాలని ఓ ఎమ్మెల్యేతోపాటు మరో సీనియర్‌ నేత… అనుచరుడిని అందలం ఎక్కించాలనే పట్టుదలతో మరో ఎమ్మెల్యే యూత్‌ కాంగ్రెస్‌ ఎన్నికను సవాల్‌గా తీసుకున్నారని అంటున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో యూత్‌ కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నెల 5 నుంచి వచ్చే నెల 5 వరకు యూత్‌ కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు ఉంటుంది. ఈ ప్రక్రియతో పాటే సంస్థాగత ఎన్నికలు ఉంటాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో ఎవరికి వారు పోటాపోటీగా సభ్యత్వ నమోదు చేస్తూ పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు.

హన్మకొండ జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ..
ఐతే హన్మకొండ జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి మాత్రం తీవ్రంగా పోటీ నెలకొనడం కాంగ్రెస్‌లో చర్చకు దారితీస్తోంది. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, వరంగల్‌, హన్మకొండ, కాజీపేట త్రీ సిటీస్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో మంత్రి కొండా సురేఖతోపాటు ఎమ్మెల్యేలు నాయని రాజేంద్రనాథ్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి ఉన్నారు. ఐతే మంత్రి కొండా సురేఖతోపాటు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి యూత్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల్లో అసలు జోక్యం చేసుకోవడం లేదని చెబుతున్నారు. పార్టీలో యవ నేతలు అంతా తమకు సమానమేనని చెబుతున్న మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు గెలిచినా తమకు ఓకే అంటున్నారట.

హన్మకొండ యూత్‌ కాంగ్రెస్‌ పదవిని సవాల్‌గా తీసుకున్న ఎమ్మెల్యేలు..
కానీ, ఎమ్మెల్యేలు కేఆర్‌ నాగరాజు, నాయని రాజేంద్రనాథ్‌రెడ్డి మాత్రం హన్మకొండ యూత్‌ కాంగ్రెస్‌ పదవిని సవాల్‌గా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఎస్సీలకు రిజర్వు చేసిన ఈ పదవి కోసం ఎమ్మెల్యే నాగరాజు కుమారుడు దిలీప్‌కుమార్‌తోపాటు ఎమ్మెల్యే నాయని అనుచరుడు పల్లకొండ సతీశ్‌ పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరికీ దీటుగా సీనియర్‌ నేత నమిండ్ల శ్రీనివాస్‌ కుమారుడు మనోజ్‌ కూడా పోటీకి సై అంటుండటంతో యూత్‌ పోరు హోరాహోరీగా మారిందంటున్నారు.

పోలీస్‌ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి యూత్‌ కాంగ్రెస్‌ పదవికి పోటీ..
ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, పీసీసీ నేత నమిండ్ల శ్రీనివాస్‌ తమ వారసుల కోసం ప్రచారం చేస్తుండటం ఆసక్తి పుట్టిస్తోంది. నమిండ్ల శ్రీనివాస్ కుమారుడు మనోజ్‌ పోలీస్‌ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి యూత్‌ కాంగ్రెస్‌ పదవికి పోటీ పడటం చర్చనీయాంశంగా మారింది. ఇక ఎమ్మెల్యే నాగరాజు కుమారుడు దిలీప్‌ తండ్రి సహకారంతో తన ప్యానెల్‌ కోసం ప్రచారం చేస్తున్నారు. మరోవైపు వరంగల్ నగరంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తన అనుచరుడు పల్లకొండ సతీశ్‌ను బరిలోకి దింపారు. సతీశ్‌కు మద్దతు కూడగట్టేలా ఎమ్మెల్యే పావులు కదుపుతుండటం యూత్‌ కాంగ్రెస్‌ ఎన్నికను ఇంట్రెస్టింగ్‌ మార్చేసిందంటున్నారు.

పార్టీపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం కొనసాగించడం కోసమే?
ఒక జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ పదవికి ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో సీనియర్‌ నేత తీవ్రంగా ప్రయత్నాలు చేయడంపై కాంగ్రెస్‌ పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. పైగా ముగ్గురూ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఇతర ఎమ్మెల్యేల సహకారం కోరుతుండటం పార్టీలో ఆసక్తి రేపుతోంది. పార్టీపై పూర్తిస్థాయిలో ఆధిపత్యం కొనసాగించడం కోసమంటూ యూత్‌ కాంగ్రెస్‌ ఎన్నికను అడ్డుపెట్టుకున్న ఎమ్మెల్యేలు.. ప్రత్యర్థి వర్గాల వారిని బెదిరిస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్‌లో ఏళ్ల తరబడి చేసినవారికే అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే నాయని వర్గం ప్రచారం చేయడంతోపాటు కొత్తగా పార్టీలోకి వచ్చి వారికి అవకాశం ఇవ్వొద్దని పిలుపునిస్తోంది. ఇక జిల్లా పరిధిలోని మిగతా ఎమ్మెల్యేలను కలుస్తున్న ఎమ్మెల్యే నాగరాజు తన కుమారుడికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. మొత్తానికి ఏ ఎన్నికకు లేని స్థాయిలో యూత్‌ కాంగ్రెస్‌పై నేతలు ఫోకస్‌ పెట్టడమే హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read : సమన్వయం లేదు, సఖ్యత లేదు.. ఎవరికి వారే యమునా తీరే..! కమలదళంలో ఎందుకీ గందరగోళం?

ట్రెండింగ్ వార్తలు