సమన్వయం లేదు, సఖ్యత లేదు.. ఎవరికి వారే యమునా తీరే..! కమలదళంలో ఎందుకీ గందరగోళం?

రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించాలని కోరుకుంటున్న కమలదళంలో ఈ గందరగోళం కార్యకర్తలను ఆవేదనకు గురిచేస్తోందంటున్నారు. పార్టీలో సమన్వయం లోపిస్తే పార్టీని బలోపేతం చేయడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

సమన్వయం లేదు, సఖ్యత లేదు.. ఎవరికి వారే యమునా తీరే..! కమలదళంలో ఎందుకీ గందరగోళం?

Gossip Garage : కమలదళంలో సమన్వయ లోపం ఉందా? పార్టీ నేతలకు.. ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరుగుతోందా? ఎమ్మెల్యేలను పార్టీ పట్టించుకోవడం లేదా? లేక ఎమ్మెల్యేలే పార్టీని పట్టించుకోవడం లేదా? పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడని ఎమ్మెల్యేలు…. అసెంబ్లీలోనూ పార్టీ వాయిస్ వినిపించే విషయంలో ఆసక్తి చూపలేదా? అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జోరు మీద కనిపించిన కమలదళంలో గందరగోళం దేనికి? కాషాయ పార్టీలో ఏం జరుగుతోంది…?

ఢిల్లీలో కిషన్ రెడ్డి బిజీబిజీ..
తెలంగాణ బీజేపీలో రాష్ట్ర కార్యవర్గానికి…. ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత కుదరడం లేదన్న వాదన వినిపిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఉన్నప్పటికీ.. ఆయన ఎక్కువగా ఢిల్లీలో ఉంటుండటం.. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టలేకపోతున్నారని… దీంతో రాష్ట్ర పార్టీలో సమన్వయం లోపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యేలు తలో దిక్కున వ్యవహరిస్తున్నారంటున్నారు. ఇక అసెంబ్లీలోనూ పార్టీ వాయిస్ పెద్దగా వినిపించలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఐతే ఎమ్మెల్యేకు… పార్టీకి మధ్య గ్యాప్ ఉండటమే ఈ పరిస్థితికి కారణమని అంటున్నారు.

పార్టీకి ఎమ్మెల్యేలకీ మధ్య గ్యాప్ బాగా పెరిగిందనే టాక్..
రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గత కొద్దిరోజులుగా ఉన్నాయి. ఇక ఇప్పుడు పార్టీకి ఎమ్మెల్యేలకీ మధ్య గ్యాప్ బాగా పెరిగిందనే టాక్ మొదలైంది. ఐతే పార్టీనే తమను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయానికి రాకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని నేతలు అంటున్నారు. దీంతో ఇటు పార్టీకి… అటు ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉందనే విషయం స్పష్టమవుతోందంటున్నారు.

ఎవరికి వారే ఎమునా తీరే అన్నట్టుగా ఎమ్మెల్యేలు..
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎమ్మెల్యేలతో రాష్ట్ర పార్టీకి సమన్వయం లేదనే విషయం బయటపడిందంటున్నారు. తెలంగాణకు కేంద్రం కేటాయించిన ప్రాజెక్టులు, నిధుల విషయమై ఎమ్మెల్యేలు తమ వాణి వినిపించలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐతే పార్టీ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేకపోతే… సభలో ఏం మాట్లాడాలని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. పార్టీకి ఎమ్మెల్యేకి మధ్య కోఆర్డినేషన్ దెబ్బతినడమే దీనికి కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన..
ఇక ఈ పరిస్థితికి ఎమ్మెల్యేలే కారణమని బీజేపీ ఆఫీసు బేరర్లు ఆరోపిస్తున్నారు. తాము పార్టీ తరఫున ఏమి మాట్లాడాలనే విషయాలను సిద్ధం చేసి అసెంబ్లీకి తీసుకువెళ్లినా… తమకు అసెంబ్లీ పాసులు ఇవ్వలేదని… కనీసం ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో గంటల తరబడి నిరీక్షించి వెనక్కిరావాల్సి వచ్చిందని చెబుతున్నారు ఆఫీసు బేరర్లు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగం మధ్య సమన్వయానికి రాష్ట్ర పార్టీలో ఎవరూ ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో చిన్న చిన్న విషయాలు సైతం ఆగాధానికి కారణమవుతున్నాయంటున్నారు. ఇరువైపులా సమన్వయం చేయాల్సిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి… కేంద్రమంత్రి హోదాలో ఢిల్లీ వ్యవహారాలకే ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం వల్ల పార్టీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే చర్చ జరుగుతోంది.

పార్టీ కార్యక్రమాల సమాచారం కూడా కరువు?
ఒక్క అసెంబ్లీ వ్యవహారమే కాదు చాలా విషయాల్లో రాష్ట్ర పార్టీకి, ఎమ్మెల్యేలకు మధ్య పూర్తిగా గ్యాప్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు కూడా ఎమ్మెల్యేలకు సమాచారం ఉండటం లేదని అంటున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన ఒకటి రెండు సమావేశాలకు ఎమ్మెల్యేలు ఎవరూ హాజరుకాకపోవడం ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తోందంటున్నారు. ఆ మధ్య జరిగిన కిసాన్ హెల్ప్‌లైన్ సెంటర్ ప్రారంభానికి ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరుకాలేదు. ఇక తాజాగా మంగళవారం జరిగిన పార్టీ సమావేశానికి ఒక్క నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాత్రమే హాజరయ్యారు. ఇలా చాలా విషయాల్లో ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీకి మధ్య సఖ్యత లోపిస్తోందంటున్నారు.

బీజేపీలో ఈ రచ్చకు తెరపడేదెప్పుడో?
రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించాలని కోరుకుంటున్న కమలదళంలో ఈ గందరగోళం కార్యకర్తలను ఆవేదనకు గురిచేస్తోందంటున్నారు. పార్టీలో సమన్వయం లోపిస్తే పార్టీని బలోపేతం చేయడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. దీనికంతటికీ కొత్త అధ్యక్ష నియామకం జరిగితేనే తెరపడుతుందనేది అంతర్గతంగా బీజేపీలో జరుగుతున్న చర్చ. కొత్త కమలనాథుడు వచ్చేదెప్పుడో, ఈ రచ్చకు తెరపడేదెప్పుడో.. అన్నదే సస్పెన్స్‌గా మారింది.

Also Read : సభలో అడుగు పెట్టేది అప్పుడే..! అసెంబ్లీకి హాజరుపై పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ క్లారిటీ..!