×
Ad

BJP: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ జోష్‌ ఏమైంది? ఆ పార్టీ నేతలెందుకు సైలంట్‌ అయ్యారు?

తెలంగాణ బీజేపీ చీఫ్‌గా రామచందర్‌రావు పగ్గాలు చేపట్టిన తర్వాత వచ్చిన తొలి ఎన్నిక. ఈ ఎన్నికను ఆయన ఎలా డీల్‌ చేస్తారో అని ఎన్నికల ముందు అందరు చర్చించుకున్నారు.

BJP: ఉపఎన్నిక అనగానే బీజేపీకి ఊపొస్తుంది. గతంలో దుబ్బాక, హుజూరాబాద్‌ బై ఎలక్షన్‌లో ఏ రేంజ్‌లో ప్రూ చేసుకున్నారో అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాత్రం ఆ జోష్‌ ఎక్కడా కనిపించ లేదు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం ప్రారంభం వరకు అన్నింట్లో ఆలస్యం చేశారు. ప్రచారాన్ని పక్కనబెడితే జూబ్లీహిల్స్‌లో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని కూడా లైట్ తీసుకున్నారు. బై ఎలక్షన్స్‌లో బీజేపీ దూకుడు ఏమైంది? ఆ పార్టీ నేతలెందుకు సైలంట్‌ అయ్యారు? ఇప్పుడివే అంశాలపై పోస్ట్‌మార్టానికి సిద్ధమైందట బీజేపీ.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రచార రథాలు గల్లీగల్లీ తిరుగుతున్న సమయంలో.. కమలం ప్రచారథం షెడ్డు కూడా దాటలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మైకులు పట్టుకొని దండయాత్ర చేస్తున్ టైమ్‌లో.. బీజేపీ అభ్యర్థిని కూడా ఫైనల్‌ చేయలేదు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఖాయమని 4 నెలల ముందే తెలిసినా.. బీజేపీ యాక్టీవ్‌ అవ్వడంలో లేట్ చేసిందన్న చర్చ పార్టీ ఆఫీసులో హాట్‌హాట్‌గా సాగుతోందట. అభ్యర్థి ఎంపిక అంశాన్ని పక్కపెడితే.. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని కూడా పట్టించుకోలేద.

బై ఎలక్షన్‌లో లోకల్ నాయకత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యిందనే గాసిప్స్ పార్టీ ఆఫీస్‌లో బిగ్‌ సౌండ్ చేస్తున్నాయట. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 400 పోలింగ్ బూత్‌లుంటే 240 పోలింగ్ బూత్‌లకు అధ్యక్షులనే నియమించలేదు. ఇక శక్తి కేంద్రాలు, వాటి ఇంచార్జీల మాట సరేసరి. బీజేపీలో ఎప్పుడు చూడని.. వినని ఆలస్యానికి ఎవరు కారణమని ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చనీయాంశమైంది.

గెలుపోటముల బాధ్యత ఆయనకే వర్తించేలా ప్రకటనలు..

తెలంగాణ బీజేపీ చీఫ్‌గా రామచందర్‌రావు పగ్గాలు చేపట్టిన తర్వాత వచ్చిన తొలి ఎన్నిక. ఈ ఎన్నికను ఆయన ఎలా డీల్‌ చేస్తారో అని ఎన్నికల ముందు అందరు చర్చించుకున్నారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై నెట్టేశారట నేతలు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఆయన పార్లమెంట్‌ పరిధిలో ఉపఎన్నిక వస్తుందంటే.. అక్కడ అభ్యర్థి ఎవరు.. ప్రచారం బాధ్యత అంతా కిషన్ రెడ్డి భజస్కంధాలపైనే ఉంటుందని ఆ పార్టీ నేతలే చెప్పేరట. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ అరవింద్ సైతం బహిరంగంగానే ప్రకటించారు. ఇది కిషన్ రెడ్డి అడ్డా అంటూ ప్రచారంలోనే కామెంట్స్ చేశారు. దీంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బాధ్యతను పరోక్షంగా కిషన్‌రెడ్డిపైకి నెట్టేశారని పార్టీలో వినిపిస్తున్న టాక్. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపోటముల బాధ్యత ఆయనకే వర్తించేలా పరోక్షంగా ప్రకటనలు కూడా చేశారట.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోకజకవర్గంలో 2023లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీకి 25వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అవి 65వేలకు పైగా పెరిగాయి. కానీ ఇప్పుడు బీజేపీ తన ఓటు శాతాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ పరిస్థితి ఇంతలా దిగజారడానికి కారణాలేంటి అన్న దానిపై పార్టీలో విశ్లేషణలు సాగుతున్నాయట. ఎక్కడ పొరపాటు జరిగిందో లెక్కలు తీస్తున్నారట.

ఎన్నికలను చాలా మంది రాజకీయ విశ్లేషకులు రన్నింగ్ రేస్‌తో పోలుస్తుంటారు. ఎవరైతే అడ్వాంటేజ్ తీసుకుంటారో వారే ముందుంటారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రన్నింగ్ రేస్‌లో బీజేపీ ముందస్తు ప్లానింగ్ లేకపోవడం వల్ల అడ్వాంటేజ్ తీసుకోవడంలో వెనకబడిందని పార్టీ నేతలే భావిస్తున్నారట. అభ్యర్థి ఎవరన్నది అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ ప్రచారం చేసి ఉంటే బాగుండనే చర్చ నడుస్తుందంట. పార్టీ క్యాడర్‌ను అంతా జూబ్లీహిల్స్‌లో మోహరించినప్పటికీ అప్పటికే ఆలస్యం అయ్యిందన్న టాక్ వినిపిస్తుందంట. నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా ఎంపీ రఘునందన్, పాయల్ శంకర్ వంటి నేతలను కమిటీలో వేసినప్పటికీ వారికి పూర్తి స్వేచ్చ ఇవ్వలేదనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయట.

మరీ ముఖ్యంగా శక్తీ కేంద్రాల ఇన్‌చార్జీలు, బూత్ ఇన్‌చార్జీల నియామకం చేసినప్పటికీ సకాలంలో చేయకపోవడం, ప్రచారం మొదలుకొని అభ్యర్థి ఎంపిక వరకు అన్నీ ఆలస్యం అవ్వడం కూడా ఒక కారణం అంటున్నారంట. చివరికి ఎలాగో ఓడిపోతున్నామని పోల్ మేనేజ్‌మెంట్‌ను సైతం సరిగా పట్టించుకోలేదంట. బయట నుంచి వచ్చిన లీడర్లు, క్యాడర్‌ ఎన్నికల రోజు జూబ్లిహిల్స్‌లో మోహరించినప్పటికీ సంస్థాగత నిర్మాణం సరిగా లేకపోవడంతో ఓటర్‌ని పోలింగ్ బూత్ దగ్గరకు తీసుకురావడంలో విఫలమయ్యారన్న చర్చ సైతం పార్టీ ఆఫీస్‌లో వినిపిస్తుంది.

కార్యకర్తలు సక్సెస్.. నాయకులు ఫెయిల్?

జూబ్లీహిల్స్ ఎపిసోడ్‌లో బయట నుంచి వచ్చి పని చేసిన బీజేపీ కార్యకర్తలు గ్రేట్ అన్న చర్చ సైతం సాగుతోంది. క్షేత్రస్థాయిలో వారికి సరైన ఏర్పాట్లు చేసినా, చేయకున్నా అకామిడేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా అందరూ అక్కడే ఉండి దాదాపు నెల రోజులు పని చేశారని అనుకుంటున్నారు. అయితే కార్యకర్తల కష్టానికి సరైన ఫలితం రావడం లేదన్న నిరాశలో సైతం ఉన్నారంట. ఈ నిరాశకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలనే చర్చ కార్యకర్తల నుంచి క్షేత్ర స్థాయిలో పనిచేసిన వారి నుంచి బలంగా వినిపిస్తోందట. అన్నింటి కంటే ముఖ్యమైనది సమయం. అలాంటి అమూల్యమైన సమయం పార్టీ కోసం కార్యకర్తలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారని పార్టీ ఆఫీస్‌లో వినిపిస్తున్న టాక్.

మరి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల నుంచైనా బీజేపీ పాఠాలు నేర్చుకుంటుందా.. సరైన విశ్లేషణ చేసుకొని పార్టీని బలోపేతం చేసుకుంటుందా లేదంటే ఇది సమిష్టి నిర్ణయం, సమిష్టి ఓటమి అని ప్రకటించి చేతులు దులుపుకుంటుందో చూడాలి.

Also Read: పోలింగ్‌ డే మిస్టేక్స్‌పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందా? కారు పార్టీని వెంటాడుతున్న ప్రశ్నలు ఏంటి?