Jeevan Reddy: 40ఏళ్ల బంధం కట్.. జీవన్ రెడ్డి నెక్ట్స్ స్టెప్‌ ఏంటి? రేవంత్‌ను గద్దె దించడమే పెద్దాయన టార్గెట్టా?

జీవన్‌రెడ్డి రాజీనామాతో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయన్న చర్చ జరుగుతోంది. జీవన్‌రెడ్డికి ఈ రెండు పార్లమెంట్‌ సెగ్మెంట్లలో బలం ఉంది.

  • Published On : March 26, 2026 / 12:10 AM IST
  • సస్పెన్స్‌కు ఫుల్‌ స్టాప్‌..కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి గుడ్‌బై
  • 20 నెలలుగా నరకం చూశానని ఆవేదన
  • పోచారం, వేంకు సలహాదారు పదవులపై ఫైర్
  • సీఎం రేవంత్ టార్గెట్‌గా జీవన్‌రెడ్డి జనం బాట..
  • నిజామాబాద్, కరీంనగర్‌ ఎంపీ సీట్లలో జీవన్‌రెడ్డికి పట్టు
  • ఐదారు అసెంబ్లీ సెగ్మెంట్లలో జీవన్‌రెడ్డికి బలమైన అనుచరగణం
  • నాలుగు జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా పనిచేసిన జీవన్‌
  • జీవన్‌రెడ్డి కారెక్కుతారా? స్వతంత్రగానే పనిచేస్తారా?

Jeevan Reddy: సస్పెన్స్ వీడింది. సాగదీతకు ఫుల్‌ స్టాప్ పడింది. నిరసన, నిర్వేదం, అసంతృప్తి, ఆవేదనల ఎపిసోడ్‌ ముగిసిపోయింది. ఇక తాడోపేడో తేల్చుకోవడమే అంటూ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు మాజీమంత్రి జీవన్‌రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీతో తనకున్న నాలుగు దశాబ్దాల బంధం తెచ్చుకున్నారు. తాను పడ్డ మానసిక వేదనను వ్యక్తం చేస్తూ..ఏకంగా సీఎం రేవంత్‌ టార్గెట్‌గానే జనం బాట పడుతానని చెప్పేశారు. జీవన్‌రెడ్డి నెక్స్ట్ స్టెప్‌ ఏంటి? రేవంత్‌ను గద్దె దించడమే పెద్దాయన టార్గెట్టా? ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జీవన్‌రెడ్డి ఎఫెక్ట్ ఎంత?

అసంతృప్తి, ఆవేదన..గుర్తింపు దక్కలేదన్న బాధ..మాజీమంత్రి జీవన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వీడేలా చేసింది. చాలారోజులుగా తిరుగుబావుటా ఎగరవేస్తూ వచ్చిన ఆయన ఫైనల్‌గా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. బుజ్జగింపులు, సీనియర్ నేతల మంతనాలు అన్నింటిని లైట్‌ తీసుకుని..ఆత్మాభిమానమే ముఖ్యమంటూ నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీతో తనకున్న అనుబంధాన్ని తెచ్చుకున్నారు. ఏఐసీపీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖ పంపారు. జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్తలు, తన అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమక్షంలోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తన పట్ల అధిష్టానం వ్యవహరించిన తీరుకు తీవ్ర మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

40 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ..పార్టీకి అండదండగా ఉన్న తనను కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవడం..ఆయనకు ప్రయారిటీ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే 20 నెలలుగా నరకం చూశానన్నారు. ఇక రాజీనామా ప్రకటన సందర్భంగా రేవంత్‌ టార్గెట్‌గా స్ట్రాంగ్‌ అటాక్‌ చేశారు జీవన్‌రెడ్డి. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై మండిపడ్డ ఆయన..పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎవరు? ఆయనకు సలహాదారు పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వేం నరేందర్‌రెడ్డికి సలహాదారు, రాజ్యసభ సీటు ఇవ్వడాన్ని కూడా తప్పుబట్టిన జీవన్‌రెడ్డి..ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ ఏంటో చెప్పాలన్నారు.

ఎంతమందిని తొక్కుకుంటూ పోతావ్?

తొక్కుకుంటూ పోతానంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన జీవన్‌రెడ్డి..ఎంతమందిని తొక్కుకుంటూ పోతావంటూ క్వశ్చన్ చేశారు. దానం నాగేందర్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయడం దేనికి సంకేతమో చెప్పాలని..సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ ఎంపీ సీట్లు ఓడిపోవడానికి రేవంత్‌ నిర్ణయాలు ఓ కారణమంటూ విమర్శల దాడి చేశారు జీవన్‌రెడ్డి.

వాస్తవానికి తన సీనియారిటీకి తగిన గుర్తింపు దక్కట్లేదని ఫీల్ అవుతూ వస్తున్నారు జీవన్‌రెడ్డి. కానీ ఆయన్ను కాంగ్రెస్ పెద్దలు లైట్ తీసుకోవడంతో..పెద్దాయన కూడా తన దారి తాను చూసుకోవాలని..హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఈ క్రమంలోనే ఆయనకు బుజ్జగింపులు మొదలయ్యాయి. కానీ వన్స్ డెసిషన్ తీసుకున్నాక నో చేంజ్ అన్నట్లుగా పార్టీని వీడారు.

కేసీఆర్‌పైనే పోటీ చేసి టఫ్‌ ఫైట్‌ ఇచ్చారు..

జీవన్‌రెడ్డి రాజీనామాతో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయన్న చర్చ జరుగుతోంది. జీవన్‌రెడ్డికి ఈ రెండు పార్లమెంట్‌ సెగ్మెంట్లలో బలం ఉంది. వ్యక్తిగతంగా మంచి పేరుంది. నాన్ కరప్ట్‌ లీడర్‌గా..సీనియర్ మోస్ట్ నేతగా ఆయనకు రిగ్నైజేషన్‌ ఉంది. ఈ క్రమంలోనే కరీంనగర్ ఎంపీగా అప్పట్లో గులాబీ బాస్ కేసీఆర్‌పైనే పోటీ చేసి టఫ్‌ ఫైట్‌ ఇచ్చారు జీవన్‌రెడ్డి. 2014లో బీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చినా జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అపోజిషన్ వాయిస్ వినిపించారు. ఇక ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్‌, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా గెలిచి..జనం గొంతుగా నిలిచారు.

కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ పక్కా..?

ఇలా ఒక్క జగిత్యాలకే పరిమితం కాకుండా..సిన్సియర్, క్లీన్ పొలిటీషియన్‌గా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జీవన్‌రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. జగిత్యాలతో పాటు ధర్మపురి, చొప్పదండి, వేములవాడ, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో జీవన్‌రెడ్డికి అనుచరగణం, పరిచయాలు బలంగా ఉన్నాయని అంటున్నారు. 1981 నుంచి రాజకీయాల్లో ఉంటూ వస్తున్న జీవన్‌రెడ్డి ఫస్ట్ టైమ్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. తర్వాత నాదెండ్ల భాస్కర్‌రావు వర్గంలో చేరి కాంగ్రెస్‌ గూటికి చేరారు. అప్పటినుంచి జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీచేస్తూ వస్తూనే ఉన్నారు. 9 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నాలుగు సార్లు గెలిచి ఐదుసార్లు ఓడిపోయారు. ఇక కరీంనగర్ ఎంపీగా రెండుసార్లు, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఓసారి కంటెస్ట్ చేసి ఓడారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు. ఈ ఈక్వేషన్స్ ప్రకారం ఆయన రాజీనామా హస్తం పార్టీకి అంతో ఇంతో డ్యామేజ్ చేయడం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది.

పైగా సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌గానే జీవన్‌రెడ్డి కామెంట్స్‌ చేస్తున్నారు. ఇన్నాళ్లు ఎక్కడా డైరెక్టుగా రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేయని జీవన్‌రెడ్డి..ఇప్పుడు బరస్ట్ అయిపోయారు. రేవంత్‌ లక్ష్యంగానే జనం బాట పడుతానంటున్నారు. ఇప్పటికే రేవంత్‌ తీరు నిరసిస్తూ..ఇండైరెక్టుగా పలుసార్లు లేఖాస్త్రాలు సంధించారు జీవన్‌రెడ్డి. పార్టీ ఫిరాయింపులు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్‌ తీరును బహిరంగ లేఖల ద్వారా ఎక్స్‌పోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో బంధాన్ని తెంచుకున్న జీవన్‌రెడ్డి..ఇక ఫ్రీ బర్డ్ అయిపోయారు. తనకు అన్యాయం జరగడానికి రేవంతే కారణమని భావిస్తున్న జీవన్‌రెడ్డి..ఆయన టార్గెట్‌గానే బాణాలు ఎక్కు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏ పార్టీలో చేరబోతున్నారన్నది సస్పెన్స్..

ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారనే ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారని బలమైన టాక్ వినిపిస్తోంది. జగిత్యాల నుంచి వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కారు దిగి..కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావటంతో..జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వ లోటు ఉంది. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డి కారుక్కుతారాన్న వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి కూడా ఆఫర్ ఉన్నా..సిద్ధాంతపరంగా ఆయన అటువైపు వెళ్లకపోవచ్చన్న చర్చ జరుగుతోంది.

భవిష్యత్‌ నిర్ణయం ఎలా ఉంటుందో తనకు తెలియదని..కర్మ సిద్ధాంతం ఎటువైపు తీసుకెళ్తుందో వేచి చూడాలని అంటున్నారు. జీవన్‌రెడ్డి ఏ పార్టీకిలోకి వెళ్తారన్నది అలా ఉంచితే..ఆయన టార్గెట్‌ సీఎం రేవంత్‌ రెడ్డే అన్నది..రాజీనామా ప్రకటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో తేలిపోయింది. జీవన్‌రెడ్డి రాజకీయ అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి.

Also Read: డీలిమిటేషన్‌పై పార్టీల్లో ఆశలు.. తెలంగాణలో అధికారం ఎవరిదో నిర్ణయించేది ఆ 2 జిల్లాలేనా?