Gossip Garage : పార్టీ ఛలో రాజ్‌భవన్ అంటూ ఆందోళన చేపట్టింది. సేమ్‌టైమ్ ఆ జిల్లా హస్తం నేతలు మాత్రం ఓ సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. అమాత్యుడి తీరుపై అసమ్మతి గళం వినిపించారు. డీసీసీ ఆఫీస్‌లో జరిగిన ఆ సమావేశం కరీంనగర్ కాంగ్రెస్ లో కల్లోలం సృష్టిస్తోంది. తనపైనే ధిక్కార స్వరమా అంటూ ఆ మంత్రి గరం గరం అవుతన్నారట. ఇంతకీ ఆ అసమ్మతి నేతలెవరు.? ధిక్కార స్వరం వెనుక ఉన్న కారణమేంటి.? ఆ నేతలు టార్గెట్ చేసిన మంత్రి ఎవరు.?
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం..
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత దక్కడం లేదంటూ డీసీసీ ఆఫీస్‌లో అసమ్మతి నేతలు సమావేశమవటం..రచ్చకు దారి తీస్తోంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని సీనియర్లు అసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ పురమళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఓపెన్ సీక్రెట్ మీటింగ్‌కు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరవడంతో పార్టీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. అంతర్గత విభేధాలు రచ్చకెక్కినట్లయింది. అధిష్టానం తీరుపైనా కొందరు అసహనం వ్యక్తం చేస్తే.. మరికొందరు ఏకంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌నే టార్గెట్ చేస్తూ తమ ఆవేదనను వెళ్లగక్కారట.
అధికారంలో ఉన్నామన్న ఆనందం లేకుండా పోయిందని ఆవేదన..
నియోజకవర్గ ఇంచార్జ్ కీలకం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుంటే..తనకు తెలియకుండానే మంత్రి పొన్నం ప్రభాకరే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహంగా ఉన్నారట పురమళ్ళ శ్రీనివాస్. ఇటీవల భర్తీ చేసిన సుడా చైర్మన్, లైబ్రరీ చైర్మన్ నామినేటేడ్ పదవులతో పాటు నిధుల కేటాయింపు, ఇసుక రీచ్‌ల కేటాయింపులన్నీ ఎవరికీ సంబంధం లేకుండా మంత్రి పొన్నం సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్ బాబు జిల్లా కేంద్రానికి వస్తే సమాచారం ఇస్తున్నారు కానీ..మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఇతర మంత్రులు వస్తే సమాచారం ఇవ్వడం లేదంటూ మండిపడుతున్నారట జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని..కార్యకర్తలకు పనులు అవసరమైతే ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియడం లేదంటున్నారు. ప్రతిపక్షంలో చెమటోడ్చి శ్రమిస్తే ఇప్పుడు అధికారంలో ఉన్నామన్న ఆనందం లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట మరికొందరు నేతలు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ గెలవకపోవడంతో..మంత్రుల దగ్గరకు క్యాడర్ వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులే అయినా…ఎవరి అనుచరవర్గం వారిని ఫాలో అవుతున్నారు. అయితే క్యాడర్ ఎవరి వెంట నడవాలో అర్ధం కానీ గందరగోళం నెలకొందట. తమ నేతలను టార్గెట్ చేయడంపై పొన్నం అనుచరులు సీరియస్ అవుతున్నారు. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చినవారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇస్తుండటంతో..ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారిపోయింది కరీంనగర్ కాంగ్రెస్ లీడర్ల పరిస్థితి. పార్టీని బలోపేతం చేయాల్సిందిపోయి..వర్గ విభేధాలతో నష్టం చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
డీసీసీ కార్యాలయంలో జరిగిన మీటింగ్‌పై అధిష్టానం సీరియస్‌గా ఉందట. ఆ మీటింగ్‌లో పాల్గొని మంత్రి పొన్నంకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఎలాగైనా పార్టీ నుంచి పంపించేయాలనే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. షోకాజ్ నోటీసులు కూడా రెడీ అవుతున్నాయట. మరి కరీంనగర్ కాంగ్రెస్‌లో మొదలైన ముసలం ఎటుదారి తీస్తుందో వేచి చూడాలి.
Also Read : సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారా? కేటీఆర్‌కు చెక్ పెట్టేందుకు హరీశ్‌ను వాడుకుంటున్నారా?