Group-1 Rankers Parents Press Meet
Group-1 Rankers Parents : గ్రూప్-1 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. గ్రూప్ -1 పరీక్షల విధానాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. గ్రూప్-1లో సెలెక్ట్ అయినా అభ్యర్థులు రూ.3కోట్లు ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు.. అవన్నీ అవాస్తవం. మాకు అంత ఆర్థిక స్తోమత లేదు. మా పరిస్థితులు చూస్తే మీకే అర్ధం అవుతుందని అన్నారు.
Also Read: Hyderabad Metro : బాబోయ్.. ఇలా అయితే కష్టం.. హైదరాబాద్ మెట్రోను మేం నడపలేం.. మీరు కొనుగోలు చేయండి..!
రూ.3కోట్ల స్కాం అనే ప్రచారం అంతా అబద్దపు ప్రచారం. గ్రూప్-1 అభ్యర్థుల విషయంలో రాజకీయం చేయొద్దు. విషయం న్యాయ స్థానం పరిధిలో ఉంది. దయచేసి గ్రూప్-1 సెలెక్ట్ అయిన అభ్యర్థులపై ఆరోపణలు మానుకోవాలని. నిజంగా అలాంటి అవకాశం ఉంటే బహిరంగంగా వాస్తవాలను బయటపెట్టాలని గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు.
రాజకీయ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నో త్యాగాలు చేసి చదివిస్తే రూ.3కోట్లకు ఉద్యోగాలు కొన్నామని నిందలు వేస్తున్నారు. ఫలితాలు వచ్చాక కొత్తగా రాజకీయం చేస్తున్నారు. నిందలు వేసి మమ్మల్ని మనోవేదనకు గురిచేయొద్దని 46వ ర్యాంకర్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
కష్టపడి చదువుకున్న మా పిల్లలపై లేనిపోని అబాంఢాలు వేయడం సరికాదు. వేల రూపాయలు ఫీజులు కట్టి చదివించాం. ఎన్నికల్లో గెలుపు ఓటములు ఏ విధంగా ఉంటుందో పరీక్షల్లో కూడా అందరూ సెలెక్ట్ కాలేరు. సెలెక్ట్ అయినా వాళ్ల మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. మా పిల్లలు గ్రూప్-1 లో సెలెక్ట్ కావడం కోసం నిద్రలేని రాత్రులు గడిపారు. ఎవరో చేసిన పాపానికి మా పిల్లలు బలి అవుతున్నారు.
మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్తు నాశనం చేయకండి.. నోటికాడ కూడు లాక్కోకండి. మళ్ళీ పరీక్షలు పెడితే.. అవి అయినా సజావుగా జరుపుతారని గ్యారంటీ ఏంటి..? మీ స్వార్థ రాజకీయాలకోసం అప్పుడు కూడా ఏవో ఒక ఆరోపణలు చేస్తారు.. మా పిల్లలు కష్టపడి ర్యాంక్ తెచ్చుకున్నా.. మీరు చేసిన ఆరోపణల వల్ల తల దించుకోవాల్సి వస్తోంది.
మూడు కోట్లు అంటున్నారు.. 3 లక్షల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఏనాడు మేము చూడలేదు. మా పిల్లలకు న్యాయం జరగాలి. మెయిన్స్ రాసి సెలెక్ట్ అయిన మా పిల్లలు జాబ్ లో జాయిన్ అవుతారని ఆశించాము. మా పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి, హైకోర్టు మాకు న్యాయం చేయాలని గ్రూప్ -1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు.
ఈనెల 9న గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని కోరుతూ కొందరు పిటీషన్లు దాఖలు చేశారు. మరికొందరు రద్దు చేయొద్దంటూ పిటీషన్లు దాఖలు చేశారు. ఇలా మొత్తం 12 పిటీషన్లురాగా.. తెలంగాణ హైకోర్టు వీటిపై విచారణ జరిపింది. 222 పేజీల తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పు, గ్రూప్-1 ర్యాంకర్ల పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించారు.