Hyderabad Metro : బాబోయ్.. ఇలా అయితే కష్టం.. హైదరాబాద్ మెట్రోను మేం నడపలేం.. మీరు కొనుగోలు చేయండి..!
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుతో తీవ్రంగా నష్టపోయిన ఎల్‌అండ్‌టీ.. తన వాటాలను విక్రయించేందుకు సిద్ధమని ప్రకటించింది.

Hyderabad Metro
Hyderabad Metro : హైదరాబాద్ నగరంలో మెట్రో రాకతో ప్రయాణం చాలా సులువుగా మారింది. నగరంలోని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎక్కడా ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా.. వేగంగా ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుతున్నారు. నగరంలో భారీ వర్షం సమయంలోనూ మెట్రో కిక్కిరిసిపోతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉద్యోగస్తులు ఎక్కువగా మెట్రోలోనే ప్రయాణం సాగిస్తున్నారు. బస్సుతో పోల్చితే మెట్రో టికెట్ ధర కాస్త ఎక్కువే. ప్రతిరోజూ లక్షల మంది ఈ మెట్రోలో ప్రయాణాలు సాగిస్తున్నారు. అయితే, హైదరాబాద్ మెట్రోను నడిపించడం మా వల్ల కాదంటూ మెట్రో యాజమాన్యం చెతులెత్తేస్తోంది.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుతో తీవ్రంగా నష్టపోయిన ఎల్‌అండ్‌టీ.. తన వాటాలను విక్రయించేందుకు సిద్ధమని ప్రకటించింది. రాష్ట్రం ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం తమ వాటాలను కొనుగోలు చేయాలని కోరింది. భారీగా నష్టాలు వస్తుండడం, అప్పులు పెరిగిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త స్పెషల్ పర్పోజ్ వెహికల్ (ఎస్‌పీవీ) ద్వారా ఈ విక్రయం జరగాలని కోరింది. ఇందుకు సంబంధించి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి జైదీప్‌కు ఎల్‌అండ్‌టీ ఉన్నతాధికారులు లేఖ రాశారు.
ఎల్ అండ్ టీ మెట్రో రైల్ తాజా వార్షిక నివేదిక ప్రకారం.. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,108.54 కోట్ల ఆదాయం రాగా.. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.1,399.31కోట్లతో పోలిస్తే 21శాతం తగ్గింది. ఫలితంగా నికర నష్టం రూ.555.04 కోట్ల నుంచి రూ.626కోట్లకు చేరింది. ఇది 13శాతం పెరుగుదల.
ప్రాజెక్టు ప్రారంభానికి ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 10 బ్యాంకుల కన్సార్టియం నుంచి అప్పులు తీసుకుంది. వీటిని ఇంకా తీర్చలేదు. 2017లో రూ.3,756 కోట్ల క్లెయిమ్‌ను రాష్ట్రానికి సమర్పించగా.. 2020లో మెట్రో పూర్తయ్యే సమయానికి అది రూ.5వేల కోట్లకు పెరిగింది.
కోవిడ్ సమయంలో మెట్రోను పూర్తిగా నిలిపేశారు. ఆ తరువాత వర్క్ ఫ్రం హోం విధానం కొనసాగుతుండడం, ట్రావెల్ కల్చర్ మార్పులతో మెట్రోల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఫలితంగా టికెట్ రెవెన్యూ క్రమంగా పడిపోతూ వచ్చింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎలివేటెడ్ రైల్ కారిడార్ ఫేజ్ -11ఏ, ఫేజ్-11 బి విస్తరణలో పీపీపీ మోడల్‌లో విస్తరించాలని చూస్తోంది. కానీ, ఈ ప్రాజెక్టుల్లో పాల్గొనలేమని ఎల్ అండ్ టీ ఇప్పటికే స్పష్టం చేసింది.