షాకింగ్.. ఇంటి బయట ఉన్న మహిళ కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్, రంగారెడ్డి జిల్లా నార్సింగిలో కలకలం

గతంలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. మిస్ ఫైర్ అయ్యి బుల్లెట్ ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది.

షాకింగ్.. ఇంటి బయట ఉన్న మహిళ కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్, రంగారెడ్డి జిల్లా నార్సింగిలో కలకలం

Updated On : July 30, 2024 / 4:15 PM IST

Gun Fire Incident : రంగారెడ్డి జిల్లా నార్సింగి గంధంగూడలో బుల్లెట్ కలకలం రేపింది. ఇంటి బయట ఉన్న మహిళ కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆర్మీ క్యాంప్ లో జవాన్లు ఫైరింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి నార్సింగి పోలీసులు చేరుకుని దర్యాఫ్తు చేశారు. గతంలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. మిస్ ఫైర్ అయ్యి బుల్లెట్ ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది.

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడలో మహిళ కాలికి బుల్లెట్ గాయం ఘటన సంచలనం రేపింది. ఆ మహిళ ఇంటి నుంచి బయటకు వచ్చి దుస్తులు ఆరవేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఆమె కాలికి బుల్లెట్ తగిలింది. వెంటనే ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, మహిళకు పెద్ద ప్రమాదం తప్పినట్లు అయ్యింది. ఆ బుల్లెట్ కాలికి కాకుండా మరో చోట తగిలి ఉంటే ఊహించని ప్రమాదం జరిగి ఉండేదని కుటుంబసభ్యులు అంటున్నారు. తాను ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ బుల్లెట్ వచ్చి తన కాలికి తాకిందని బాధితురాలు తెలిపింది.

కాలికి స్వల్ప గాయం మాత్రమే కావడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. గతంలో ఇదే ప్రాంతంలో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ చేస్తుండగా.. గురి తప్పిన బుల్లెట్ ఇళ్ల వైపు దూసుకొచ్చింది. తాజాగా ఇది రెండో ఘటన. వరుస ఘటనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి బుల్లెట్ వచ్చి తమను తాకుతుందోనని హడలిపోతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

Also Read : నర్సాపురం ఎంపీడీవో ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. సైబర్ నేరగాళ్ల కోసం పోలీసుల వేట..