నేను అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిశానా? అంటూ మంత్రి కోమటిరెడ్డికి హరీశ్ రావు సవాల్

తాను ఏ దేశం వెళ్లానో, ఏ హోటల్‌లో ఉన్నానో, తదితర వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని..

నేను అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిశానా? అంటూ మంత్రి కోమటిరెడ్డికి హరీశ్ రావు సవాల్

Harish Rao

Updated On : June 2, 2024 / 5:46 PM IST

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహ వ్యక్తం చేశారు. హరీశ్ రావు దొంగచాటుగా అమెరికా వెళ్లి వచ్చారని, ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావును కలవడానికే వెళ్లారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.

దీనిపై హరీశ్ రావు స్పందిస్తూ… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మతిభ్రమించిందని చెప్పారు. అబద్ధాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ అని అన్నారు. తాను, తన కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లింది వాస్తవమని చెప్పారు. అయితే, ప్రభాకర్ రావును కలిసినట్టు వెంకట్ రెడ్డి అంటున్నారని తెలిపారు.

తాను అమెరికా వెళ్లి ప్రభాకర్ రావుని కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని చెప్పారు. ఒకవళఏ రుజువు చేయకపోతే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలని సవాలు విసిరారు.

తాను ఏ దేశం వెళ్లానో, ఏ హోటల్‌లో ఉన్నానో, తదితర వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన పాస్‌పోర్ట్‌ సహా ఇతర వివరాలు తీసుకొని బహిరంగ చర్చకు వస్తానని అన్నారు. పాస్‌పోర్టులో ఇమిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయని తెలిపారు. కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి మాట్లాడటం చౌకబారుతనమని చెప్పారు.

కోమటిరెడ్డి దగ్గర ఉన్న వివరాలతో రుజువు చేయాలని, ఆధారాలతో రావాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి చెప్పిన తేదీన, చెప్పిన సమయానికి అమరవీరుల స్తూపం వద్దకు వస్తానని, ఆధారాలతో మీరు రావాలని అన్నారు. చిల్లర వ్యాఖ్యలు చేయడం మాని పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు