Harish Rao: ‘తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టుగా ఉన్నది ఈటల వైఖరి’

Harish Rao Responds On Eetala Resignation Comments
Harish Rao: టీఆర్ఎస్ పార్టీతో పొరపచ్చాలు రావడంతో పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు ఈటల రాజేందర్. ఇక్కడ వరకూ బాగానే ఉంది కానీ, ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును పదేపదే తనకు జరిగిన అనుభవాలతో పోల్చుకుని చెప్పడం వంటివి చేశారు ఈ మాజీ మంత్రి. పార్టీ అధిష్టానం నన్ను(ఈటల రాజేందర్) మాత్రమే కాదు హరీశ్ రావుతోనూ అలాగే ప్రవర్తించిందని చెప్పారు.
ఈ కామెంట్లపై టీఆర్ఎస్ పార్టీ నేత, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు నేరుగా స్పందించారు. టీఆర్ఎస్ పార్టీతో ఆరంభం నుంచి తనకు ఉన్న సంబంధాన్ని తెలియబరుస్తూ.. ఈటల చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. స్వార్థపూరిత కామెంట్లు చేసి తనను ఇందులోకి లాగుతున్నారని ఆరోపించారు.
‘టీఆర్ఎస్ పార్టీలో నిబద్దత, విధేయత, క్రమశిక్షణ ఉన్న కార్యకర్తని. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నా. పార్టీ కార్యకర్తగా ఉన్న నాకు పార్టీ, నాయకత్వం ఏ పని అప్పగించినా దాన్ని పూర్తిచేయడం నా విధి, బాధ్యత. పార్టీ నాయకుడిగా కేసీఆర్ ఇచ్చిన ఆదేశం శిరసావహించడం నా కర్తవ్యం. కేసీఆర్ పార్టీ అధ్యక్షులే కాదు.. నాకు గురువు, మార్గదర్శి, తండ్రితో సమానులు. ఆయన మాట దాటకుండా నడుచుకుంటున్నా.
గతంలో అనేకసార్లు ఇదే విషయం సుస్ఫష్టంగా అనేక వేదికలపై చెప్పా. ఇప్పుడు మరోసారి చెప్తున్నా. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఇలాగే నడుచుకుంటా. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టుగా ఉన్నది ఈటల రాజేందర్ గారి వైఖరి. పార్టీని వీడటానికి ఆయనకు అనేక కారణాలుండొచ్చు. పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా అనేది ఆయన ఇష్టం. పార్టీని వీడిన టీఆర్ఎస్ పార్టీకి వీసమెత్తు నష్టం కూడా లేదు. రాజేందర్ పార్టీకి చేసిన సేవకన్నా.. పార్టీ నుంచి ఆయనకు వచ్చిన అవకాశాలే ఎక్కువ.
తన సమస్యలకు, తన గొడవకు నైతిక బలం కోసం పదేపదే నా పేరును ప్రస్తావించడం ఈటల రాజేందర్ భావదారిద్య్రానికి, విజ్ఙత, విచక్షణలేమికి నిదర్శనం. నా భుజాల మీద తుపాకి పెట్టాలనుకోవడం విఫల ప్రయత్నం మాత్రమే కాదు.. వికారమైన ప్రయత్నం కూడా. ఆయన మాటల్లో మనో వికారమే తప్ప సత్యం ఎంత మాత్రం లేదు. నా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా.. అని ఘాటుగా రిప్లై ఇచ్చారు తన్నీరు హరీష్ రావు.