హైదరాబాద్‌తో పాటు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం
కుకట్‌పల్లి, మియాపూర్, మల్కాజగిరి, ఎల్బీనగర్, బేగంపేట, జూబ్లిహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కుండపోతగా వాన పడుతోంది.

Hyderabad Rain: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో గురువారం పలు జిల్లాల్లో వర్సాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ భారీ వర్షం కురుస్తోంది. కుకట్‌పల్లి, మియాపూర్, మల్కాజగిరి, ఎల్బీనగర్, బేగంపేట, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, ఉప్పల్, గచ్చిబౌలి, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కుండపోతగా వాన పడుతోంది. మరో నాలుగు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని నగర పౌరులకు జీహెచ్ఎంసీ సూచించింది.
పలు జిల్లాల్లో జోరుగా వాన
ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో వర్షం పడుతోంది. మెదక్ జిల్లా నర్సాపూర్, పాపన్నపేట మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వాన కురుస్తోంది.
సంగారెడ్డి, వట్ పల్లి, కోహిర్ మండలాల్లోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.
మరో 4 రోజులపాటు ఇదే పరిస్థితి
ఈరోజు హైదరాబాద్ అంతట మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం 10Tvతో చెప్పారు. సాయంత్రం ఏడు గంటల వరకు వర్షం పడే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి తెలంగాణలో ఉంటుంది. ఈసారి నైరుతి రుపవనాలు ముందుగానే తెలంగాణకు వచ్చే అవకాశం ఉందన్నారు. జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.