Rain Alert: మూడ్రోజులు ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణలో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Heavy rains in Telangana

Rain Alert: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. వచ్చే మూడ్రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తూర్పు- మధ్య అరేబియా సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడుతోంది. గురువారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read: Rythu Bharosa: రైతులకు గుడ్‌న్యూస్.. అకౌంట్స్‌లో రైతు భరోసా రూ. 6వేలు పడే డేట్ ఫిక్స్.. ఈ నెల‌లోనే

ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..
వచ్చే మూడు రోజులు రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ చెప్పింది.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

హైదరాబాద్ లో భారీ వర్షం..
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సంతోష్ నగర్ సర్కిల్ పరిధిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మలక్ పేట సర్కిల్ పరిధిలో 9 సెంటీమీటర్లు, ఎల్బీ నగర్, అంబర్ పేట సర్కిల్ పరిధిలో 7 సెంటీమీటర్లు, ఉప్పల్, సరూర్ నగర్, పటాన్ చెరువు, ముషీరాబాద్ సర్కిల్ పరిధిలో 6 సెంటీమీటర్లు, చాంద్రాయణగుట్ట, చార్మినార్, కాప్రా, శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లలో ఐదు సెంటీటర్లు వర్షపాతం నమోదైంది. గ్రేటర్ పరిధిలోని 50 ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా రాత్రి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. పలు ప్రాంతాల్లోని రహదారులపైకి వర్షంపునీరు చేరి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం ఉదయం కూడా వాతావరణం మేఘావృతమై ఉంది. పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరో మూడు రోజులు హైదరాబాద్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అప్రమత్తంగా ఉండండి : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర రాజధానితోపాటు పలు జిల్లాల్లో పడుతున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరో మూడు రోజులపాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ లో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.