హైదరాబాద్ – విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు

సంక్రాంతి పండుగ సందర్భంగా భాగ్యనగర వాసులు పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Hyderabad - Vijayawada Highway

Hyderabad – Vijayawada Highway : సంక్రాంతి పండగ వచ్చిదంటే హైదరాబాద్ నగరం ఖాళీ అవుతుంది. హైదరాబాద్ తో పాటు ఇతర పట్టణాల్లో నివాసం ఉండే పల్లెవాసులు తమ సొంత గ్రామాలకు పయనం అవుతారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అయితే పండుగ జోష్ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ ఏపీలోని పలు ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సొంత వాహనాలు (కార్లు, ఇతర వాహనాలు) ఉన్నవారు తమతమ వాహనాల్లో సొంత ప్రాంతాలకు పయనం అవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ – విజయవాడ హైవే పై వాహనాల రద్దీ పెరిగింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ వల్ల గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తుంది.

Also Read : Flying Kites on Makar Sankranti : సంక్రాంతి నాడు గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా?

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరగడంతో శనివారం వాహన దారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం వేళ పొంగమంచు కారణంగా హైవేపై వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దీంతో చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఎల్బీ నగర్ నుంచి దండుమల్కాపురం వరకు ఆరు వరుసల రహదారి విస్తరణ పనులు జరుగుతుండటంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు ఏపీ, తెలంగాణలోని పల్లె ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి.

Also Read : సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు ఎన్నంటే?

ఈ సంక్రాంతి పండుగకు ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణీకులకోసం ప్రత్యేక బస్సులను నడుపుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చేవారికోసం 1,600 బస్సులు కేటాయించింది. వీటికితోడు మరో వెయ్యి బస్సులను అదనంగా ఏపీఎస్ఆర్టీసీ కేటాయించింది. టీఎస్ ఆర్టీసీ కూడా సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు వెయ్యికిపైగా ప్రత్యేక బస్సులను నడుపుతుంది. దక్షిణ మధ్య రైల్వే సైతం తెలుగు రాష్ట్రాల మధ్య 115 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.