సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు ఎన్నంటే?
హైదరాబాద్ నుంచి పండుగకు సొంతూళ్లకు వచ్చే వారికోసం ఏపీఎస్ ఆర్టీసీ అదనంగా మరో వెయ్యి బస్సులను నడిపేందుకు సిద్ధమైంది.

APSRTC
Sankranti 2024 Special Buses and Trains: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ అంటే పట్టణాల్లో నివాసం ఉండే పల్లెవాసులంతా తమ సొంత గ్రామాలకు పయణమవుతారు. ప్రతీయేటా సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీతో ఆర్టీసీ బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిపోతుంటాయి. సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక బస్సులు, రైళ్లను నడుపుతూ వస్తోంది. ఈ సంక్రాంతి ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకోసం ప్రత్యేక బస్సులను నడపనుంది. ఇప్పటికే 6,795 స్పెషల్ బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధం చేసింది. వాటిలో హైదరాబాద్ నుంచి వచ్చేవారికోసం 1,600 బస్సులు కేటాయించింది.
అదనంగా మరో 1000 బస్సులు
తాజాగా హైదరాబాద్ నుంచి పండుగకు సొంతూళ్లకు వచ్చే వారికోసం ఏపీఎస్ ఆర్టీసీ అదనంగా మరో వెయ్యి బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. పండుగ తరువాత మళ్లీ హైదరాబాద్ వచ్చేవారికోసం కూడా మరికొన్ని సర్వీసులు కేటాయిస్తామని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీటన్నింటిలో సాధారణ ఛార్జీలే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సంక్రాంతి సందర్భంగా 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 626 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్ల సౌకర్యం కల్పించింది. ఈనెల 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికుల కోసం అందుబాటులో ఉండనున్నాయి. వీటిలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు సంక్రాంతి సందర్భంగా 1450 ప్రత్యేక బస్సులు నడవనున్నాయి.
Also Read : TSRTC Buses : రోడ్డెక్కనున్న 80 కొత్త బస్సులు
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లు
మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను నడపనుంది. ఇప్పటికే పలు ప్రాంతాల మీదుగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వాటిలో 10వ తేదీ రాత్రి 8.25 గంటలకు తిరుపతి – సికింద్రాబాద్, 11వ తేదీ రాత్రి 7గంటలకు సికింద్రాబాద్ – కాకినాడ టౌన్, 12వ తేదీ రాత్రి 9గంటలకు కాకినాడ టౌన్ – సికింద్రాబాద్, 13వ తేదీ రాత్రి 9గంటలకు సికింద్రాబాద్ – కాకినాడ టౌన్, 14వ తేదీ కాకినాడ టౌన్ – తిరుపతి, 15వ తేదీ తెల్లవారు జామున 5.30 గంటలకు తిరుపతి – కాచిగూడ కు ప్రత్యేక రైళ్లు ప్రయాణించనున్నాయి. తాజాగా మరో రెండు రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ రెండు రైళ్లు జనవరి 15 నుంచి 16 తేదీల్లో అందుబాట్లో ఉంటాయి. హైదరాబాద్ – నర్సాపూర్, నర్సాపూర్ – హైదరాబాద్ మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి.