Holi 2023: మోదుగుపూల వంటి సహజసిద్ధమైన రంగులతో హోలీ పండుగ చేసుకోవాలి: సీఎం కేసీఆర్
ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భేదభావాలను వీడి పరస్పర ప్రేమాభిమానాలను చాటుకుంటూ ప్రజలందరూ మోదుగుపూల వంటి సహజసిద్ధమైన రంగులతో హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
- T Venkateshwarlu
- Published On : March 6, 2023 / 07:34 PM IST
CM KCR
Holi 2023: ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భేదభావాలను వీడి పరస్పర ప్రేమాభిమానాలను చాటుకుంటూ ప్రజలందరూ మోదుగుపూల వంటి సహజసిద్ధమైన రంగులతో హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకుని, వినూత్నంగా పున:ప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. చిగురించే ఆశలతో తమ జీవితాల్లోకి నూతనత్వాన్ని హోలీ రూపంలో స్వాగతం పలికే భారతీయ సాంప్రదాయం రమణీయమైనదన్నారు. హోలీ పండుగ నేపథ్యంలో పల్లెలన్నీ వెన్నెల నవరాత్రుల్లో సాగే చిన్నారుల జాజిరి ఆటాపాటలతో, కోలాటాల చప్పుళ్లతో ఉత్తేజం వెల్లివిరుస్తుందని సీఎం తెలిపారు.
పిల్లాపెద్దా తేడా లేకుండా సింగిడి రంగుల నడుమ ఖేలీ కేరింతలతో సాగే హోలీ, మానవ జీవితమే ఒక వేడుక అనే భావనను, ప్రకృతితో మమేకమై జీవించాలనే తత్వాన్ని మనకందిస్తుందన్నారు. స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రగతి కార్యాచరణ, తెలంగాణలోని దళిత బహుజన, సకల జనుల జీవితాల్లో నిత్య వసంతాన్ని నింపిందని కేసీఆర్ తెలిపారు. దేశ ప్రజలందరి జీవితాల్లో నూతనోత్తేజం వెల్లివిరిసేదాకా తమ కృషి కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ అన్నారు.
Holi 2023: హోలీ రంగులతో జాగ్రత్త.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
