Amnesia Pub Issue
Amnesia Pub Issue : సంచలనం రేపిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు రావడంతో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మనవడు ఫరాన్ అహ్మద్ స్పందించాడు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. అసలు వాళ్లు ఎవరో కూడా నాకు తెలియదన్నాడు. తాను బ్యాచిలర్ పార్టీ ఇవ్వలేదన్న హోంమంత్రి మనవడు, ఘటన జరిగిన రోజున(గత నెల 28న) తాను ఇంట్లోనే ఉన్నట్టు చెప్పాడు. బీజేపీ కావాలనే తన గురించి తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డాడు. తనపై ఆరోపణలు చేసిన వాళ్లు నిజాలు తెలుసుకోవాలని సూచించాడు. పోలీసుల విచారణకు తాను సహకరిస్తానన్నాడు.
జూబ్లీహిల్స్ లోని అమ్నేషియా పబ్ దగ్గర బాలికను కారులో తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ కేసు రాజకీయ రంగు పలుముకుంది. ఈ కేసులో నిందితులు అధికార పార్టీకి చెందిన నాయకుల పిల్లలు అని తెలియడంతో విపక్షాలు రంగంలోకి దిగాయి. ప్రభుత్వాన్ని, పోలీసులను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.(Amnesia Pub Issue)
ఈ కేసులో హోంమంత్రి మనవడు ఉన్నాడని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. పబ్ పార్టీని బుక్ చేసింది హోంమంత్రి మనవడే అని ఆయన ఆరోపించారు. హోంమంత్రి పీఏ హరినే అమ్మాయిని లోపలికి పంపించాడని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో ముద్దాయిల పేర్లు పెట్టకపోవడం వెనుక అసలు కారణం ఏంటని రఘునందన్ ప్రశ్నించారు. హోంమంత్రి మనవడు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు, ఇతర ఎమ్మెల్యేల కుమారుడు ఈ వ్యవహారంలో ముద్దాయిగా ఉన్నారు కాబట్టే ఎఫ్ఐఆర్‌లో వారి పేర్లు పెట్టలేదని రఘునందన్ రావు ఆరోపించారు.
నిందితులు ఉపయోగించిన కారును ఇప్పటివరకు ఎందుకు సీజ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి కేసులో సామాన్యులు ఉంటే వారిని వెంటనే అరెస్ట్ చేసే పోలీసులు.. నిరసనలకు దిగే ప్రతిపక్షాలపై కఠినంగా వ్యవహరించే పోలీసులు.. ఈ కేసులో ఇలా వ్యవహరించడం బాధాకరమని వాపోయారు.
అమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ వ్యవహారంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. అత్యాచారానికి గురైన బాలికను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులపై పోక్సో, నిర్భయ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలికను పబ్‌కు తీసుకెళ్లిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు గంటల పాటు మైనర్ బాలికపై నడుస్తున్న కారులోనే నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మరో కారులో పబ్ దగ్గర బాలికను వదిలివెళ్లారు.
MLA Raja Singh : వాహనాలు రేప్ చేశాయా? జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్ అనుమానాలు
తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని బాలిక ఆమె తండ్రికి వివరించింది. దీంతో బాలికను తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె తండ్రి.. తన కూతురుపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. పబ్, బేకరీతో పాటు పలు ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
బాలిక గ్యాంగ్ రేప్ కేసు దర్యాఫ్తులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుల కోసం వేట సాగిస్తున్న పోలీసులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు నిందితుల్లో ఒకరు.. తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు ఉన్నాడు. అతడితో పాటు మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో పోలీసులు వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకుని అరెస్ట్ చేశారు.