Wine Shops Close
Wine Shops Close : మందు బాబులకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు ఆ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈనెల 9వ తేదీ సాయంత్రం 6గంటల నుంచి నవంబర్ 12వ తేదీ వరకు వైన్స్, బార్లు, మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు (స్టార్ హోటళ్లలోని బార్‌లు, రిజిస్టర్డ్ క్లబ్‌లతో సహా) పూర్తిగా బంద్ కానున్నాయి. మళ్లీ 14వ తేదీ కూడా మద్యం విక్రయాలపై నిషేధం విధించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈనెల 11న ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి ప్రచారపర్వం ఈ నెల 9వ తేదీ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులతోపాటు, ఆయా పార్టీల ముఖ్యనేతలు ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే, ఉప ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు నేపథ్యంలో హైదరాబాద్ లో మూడు రోజులు పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ముందు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు రోజు.. ఈ మూడు దశల్లో మద్యం దుకాణాలు తాత్కాలికంగా బంద్ కానున్నాయి. ఈమేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మోహంతీ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20 ప్రకారం అవినాష్ మోహంతీ ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తర్వుల ప్రకారం.. సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రాంతాల్లో ఉన్న అన్ని వైన్ షాపులు, మద్యం దుకాణాలుసహా రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు, స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్‌లలోని బార్లు మూసివేయనున్నారు. ఉప ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా.. ప్రశాంత వాతావరణం నెలకొనేలా ఈ చర్యలు తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పోటీ చేస్తుండగా.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు.