Metro Phase 2: మెట్రో ఫేజ్-2లో సవాళ్లు, అద్భుతాలు.. భూగర్భంలో రైలు, డబుల్ డెక్కర్.. రూ.38,595 కోట్లతో భారీ ప్రాజెక్ట్
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ(Metro Phase 2) ప్రాజెక్టు పలు ఇంజనీరింగ్ అద్భుతాలకు, సవాళ్లకు వేదిక కానుంది.
Hyderabad metro phase 2 underground tunnel hakimpet double decker madinaguda
- భూగర్భంలోంచి హకీంపేట మెట్రో మార్గం
- మదీనాగూడలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్
- రూ.38,595 కోట్లతో మెట్రో విస్తరణ
Metro Phase 2: హైదరాబాద్ నగరం నలుమూలలకూ ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు సిద్ధమవుతున్న మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు పలు ఇంజనీరింగ్ అద్భుతాలకు, సవాళ్లకు వేదిక కానుంది. మొత్తం 116.2 కిలోమీటర్ల పరిధిలో రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో అత్యంత క్లిష్టమైన డిజైన్లను చేర్చారు. ముఖ్యంగా జేబీఎస్-శామీర్పేట కారిడార్లోని హకీంపేట విమానాశ్రయం వద్ద రన్వేకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా 1.65 కి.మీ., అలాగే నాగోల్-శంషాబాద్ మార్గంలో ఎయిర్పోర్ట్ సమీపంలో 1.6 కి.మీ. మేర మెట్రోను భూగర్భంలో (టన్నెల్) ప్రతిపాదించడం విశేషం.
NHAI: వాహనదారులకు NHAI గుడ్ న్యూస్.. అందుబాటులోకి రూ.350 లోకల్ పాస్.. ఎవరికీ వర్తిస్తుందో తెలుసా?
మదీనాగూడ వద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. రైల్వే క్రాసింగ్ల సవాల్:
మదీనాగూడ – చందానగర్ మధ్య 1.2 కిలోమీటర్ల మేర మొదటి అంతస్తులో ఎలివేటెడ్ ఫ్లైఓవర్, దానిపై రెండో అంతస్తులో మెట్రో(Metro Phase 2) వెళ్లేలా ‘డబుల్ డెక్’ నమూనాను రూపొందించారు. ఈ మార్గంలో ఫలక్నుమా, ఆరాంఘర్, లోతుకుంట, అల్వాల్ వంటి కీలక ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లను దాటుకుని వెళ్లాల్సి ఉంది. వీటితో పాటు నేషనల్ హైవేస్ (NH-65, NH-44) పరిధిలోని రహదారుల పైభాగంలో పిల్లర్ల నిర్మాణానికి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సహా పౌర విమానయాన శాఖ అనుమతులు కోరారు.
కేంద్ర, రాష్ట్ర వాటాలు.. మున్సిపల్ పరిధుల్లో కనెక్టివిటీ:
ఈ భారీ ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 31% అనగా రూ.11,933 కోట్లు, కేంద్రం 17% అనగా రూ.6,666 కోట్లు భరించనుండగా, మిగిలిన 52% అనగా రూ.19,996 కోట్లు రుణాలుగా సేకరించనున్నారు. ఈ రెండో దశ మార్గం జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ పరిధుల గుండా సాగనుంది. రోజువారీగా 12.42 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించడమే లక్ష్యంగా వేగంగా అనుమతులు తెప్పించేందుకు అధికారులు ముమ్మర యత్నాలు చేస్తున్నారు.
