Hyderabad Park : పెళ్లి కాని జంటలకు నో ఎంట్రీ.. ఇందిరా పార్కు వద్ద బ్యానర్.. ఫొటో వైరల్

ఈ పార్కులోకి పెళ్లికాని జంటలకు నో ఎంట్రీ అంటూ ఒక బ్యానర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఎక్కడో కాదు.. మన హైదరాబాద్ ఇందిరా పార్క్.. బయటివైపు ఒక సైన్ బోర్డు దర్శనమిచ్చింది.

Hyderabad Park : పెళ్లి కాని జంటలకు నో ఎంట్రీ.. ఇందిరా పార్కు వద్ద బ్యానర్.. ఫొటో వైరల్

Hyderabad Park Prohibits Unmarried Couples From Entering, Notice Goes Viral

Updated On : August 26, 2021 / 7:32 PM IST

Hyderabad Park Prohibits Unmarried Couples : ఈ పార్కులోకి పెళ్లికాని జంటలకు నో ఎంట్రీ అంటూ ఒక బ్యానర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఎక్కడో కాదు.. మన హైదరాబాద్ ఇందిరా పార్క్.. బయటివైపు ఒక సైన్ బోర్డు దర్శనమిచ్చింది. ఆ బోర్డుపై పెళ్లికాని జంటలకు పార్కులోనికి అనుమతి లేదు అంటూ రాసి ఉంది. ఈ బోర్డును పార్క్ మేనెజ్ మెంట్ ఏర్పాటు చేసింది. ప్రతిరోజూ నగరంలోని దోమలగూడలో ఉండే ఇందిరా పార్క్‌కు సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. ఇందిరా పార్క్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు తెరిచే ఉంటుంది.

ఈ పార్క్ వద్ద తాజాగా కనిపించిన ఒక బ్యానర్ అందరిని షాక్ గురిచేసింది. ఇప్పుడీ ఈ బ్యానర్ కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మీరా సంఘమిత్ర అనే సామాజికవేత్త స్పందించారు. ఈ పోస్టును జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి ట్యాగ్ చేశారు. పార్కులో ప్రవేశానికి పెళ్లి అర్హత ఏంటి? అని ఆమె ప్రశ్నించారు.

పార్కు అన్నాక అందరికి ప్రవేశం ఉంటుంది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య’ ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియా నుంచి ఈ బ్యానర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. విషయం కాస్తా జీహెచ్ఎంసీ దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించి ఇందిరా పార్క్ వద్ద ఆ బ్యానర్‌ను తొలగించింది. వైరల్ అవుతున్న ఈ బ్యానర్ పై నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇకపై ఇందిరా పార్కుకు వెళ్లేవారంతా తప్పనిసరిగా మ్యారేజీ సర్టిఫికేట్ వెంట్ తీసుకెళ్లాల్సిందేనని ఒక యూజర్ కామెంట్ చేశాడు.


మరో యూజర్.. బ్యాడ్మింటన్ ప్లేయర్లు అందరూ తమ పార్టనర్లను మ్యారేజ్ చేసుకోవాల్సిందేనా? అంటూ కామెంట్ పెట్టాడు. మరోవైపు పార్క్ మేనేజ్ మెంట్ కూడా బ్యానర్‌ కలకలంపై స్పందించింది. పార్కు ముందున్న బ్యానర్ తొలగించినట్టు సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ట్వీట్ చేశారు. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, పార్కు ప్రాంగణంలో నిఘా పెట్టి ఉంచమని స్థానిక పోలీసులకు సూచించినట్టు తెలిపారు.