Kotha Prabhaka Reddy - Dubbaka (Photo : Google)
Kotha Prabhaka Reddy – Dubbaka : దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ కొత్త ప్రభాకర్ కి కేటాయించిన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ పాల్గొన్నారు.
ఎన్నో ధర్నాలు, కేసులు మోసింది దుబ్బాక గడ్డ అని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. దుబ్బాకకు ఏం కావాలో తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అదే లక్ష్యంతో ప్రాజెక్టులు నిర్మించారని చెప్పారు. కూడవెల్లి వాగు ఎండాకాలంలో కూడా ప్రవహిస్తోందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ కృషే అని చెప్పారు. గతంలో ఎకరం భూమి ధర 5, 6 లక్షలకు ఉండేదని.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కోటి వరకు ధర పలుకుతోందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
”వార్డు మెంబర్ నుండి ముఖ్యమంత్రి వరకు తెలంగాణలో ఎగిరేది బీఆర్ఎస్ పార్టీయే. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా. ఎవరూ అధైర్యపడొద్దు. టీడీలో, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారం నమ్మకండి. ప్రజలే వారికి బుద్ధి చెబుతారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే లంచగొండితనం ఎక్కువ అవుతుందని ప్రజలు నమ్ముతున్నారు. కాంగ్రెస్ పని ఖతం అయినట్టే.
దుబ్బాక నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులు చేసి చూపిస్తా. ఫోటోలకు పోజులిచ్చే రఘునందన్ ను ప్రజలు నమ్మవద్దు. రఘునందన్ వ్యవహారం గోడమీద పిల్లిలా మారింది. ఆయనది ఒడిసిపోయిన దుకాణమే. చేతిలో కత్తెర, కారులో కొబ్బరికాయ తప్ప ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఏది ఏమైనా దుబ్బాక గడ్డమీద ఎగిరేది గులాబీ జెండానే. భారీ మెజార్టీతో కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలి” అని కొత్త ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Also Read..BRS List: రాజయ్యకు మొండిచేయి.. రేఖా నాయక్ కు షాక్