RS Praveen Kumar(Photo : Google)
RS Praveen Kumar – Koneru Konappa : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో బహుజన ఆత్మగౌరవ సభలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. బీఎస్పీ పేదల పార్టీ అని ప్రవీణ్ కుమార్ చెప్పారు. బోథ్ నియోజకవర్గంలో రోడ్లన్నీ అత్యంత దారుణంగా మారాయని వాపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. అభివృద్ధిలో వెనుకంజలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రవీణ్ కుమార్ వాపోయారు. పేద మధ్య తరగతి కుటుంబాలకు కనీసం బియ్యం కూడా అందకపోవడం బాధాకరం అన్నారు. కానీ.. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు ఉండే ఊర్లలో మాత్రం రోడ్లు అద్దంలాగా మెరిసిపోతున్నాయన్నారు.
”కేజీవీపీ పాఠశాలల్లో పిల్లలకు కనీస వసతులు లేవు. మారుమూల ప్రాంత ప్రజలకు విద్య, ఆరోగ్యం అందడం లేదు. బోథ్ నియోజకవర్గంలో కనీస ప్రభుత్వ కార్యక్రమాలు లేవు. బోథ్ ను కనీసం రెవెన్యూ డివిజన్ కూడా చేయలేకపోయారు. ప్రభుత్వ భూముల్లో పేదల కోసం ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించాలి. పోడు రైతులందరికీ పోడు పట్టాలు ఇవ్వాల్సిందే.
పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలి. దళితబంధు ప్రతి ఒక్కరికీ ఇవ్వాలి. బీసీ, ఓసీ బంధు స్కీమ్ లను ప్రవేశపెట్టి పేదలను ఆదుకోవాలి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో బందీలైన బహుజన బిడ్డలను విడుదల చేయాలి. నేను స్థానికుడిని. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆంధ్రకు చెందిన వ్యక్తి. కోనప్ప కలప దొంగ. కోనప్ప దోపిడీ చేసింది పేదలకు పంచి పెడతాం” అని ప్రవీణ్ కుమార్ అన్నారు.