ఇదేందయ్యా ఇదీ.. చికెన్ వెరీ వెరీ చీప్.. అన్నిచోట్లా రేట్లు మండిపోతుంటే ఇక్కడ మాత్రం..

చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా వచ్చి కొనుక్కుని వెళ్తున్నారు.

Chicken price

తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో చికెన్ ధరలు పెరిగిపోతుంటే ఓ ప్రాంతంలో మాత్రం మార్కెట్‌ రేట్‌ కంటే కిలోకు దాదాపు రూ.30 తక్కువ ధరకు అమ్ముతుంటారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లి చూస్తే రూ.150కే కిలోచికెన్‌ అన్న బోర్డులు కనపడుతున్నాయి.

తాజాగా, ఇతర ప్రాంతాల్లో స్కిన్‌తో చికెన్‌ ధర కిలో రూ.181గా ఉంది. కామారెడ్డిలో మాత్రం అంతకంటే రూ.31 తక్కువకు అమ్ముతున్నారు. స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర ఇతర ప్రాంతాల్లో కిలో పేపర్‌ ధర ప్రకారం రూ.206 ఉంది.

కామారెడ్డి కేంద్రంలో మాత్రం రూ.180కు అమ్ముతున్నారు. ఇతర ప్రాంతాల్లో లైవ్‌ బర్డ్‌ ధర కిలోకు రూ.128గా ఉంది. కామారెడ్డిలో రూ.120కి అమ్ముతున్నారు. అక్కడి ఏ షాపునకు వెళ్లినా ఇలాగే తక్కువ ధరలకు దొరుకుతున్నాయి.

తెలంగాణలో ఇలాంటి విధానం మరెక్కడా లేదు. దాదాపు ఐదేళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు కామారెడ్డి కేంద్రంలో ఇవే శిధానం కనపడుతోంది. తాము పేపర్‌ రేట్‌ కంటే రూ.30 తక్కువ ధరకు చికెన్‌ అమ్ముతాయని ఇక్కడి చికెన్ వ్యాపారులు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు.

Telangana Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా డబ్బులు వేసే డేట్‌ ఇదే..

ఆ ప్రాంతంలో చికెన్‌ తక్కువ ధరకు లభ్యమవుతుండడంతో అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల వారు అంతా ఇక్కడికే వచ్చి చికెన్‌ కొనుక్కెళుతున్నారు. తమ ఇళ్లలో ఏవైనా శుభకార్యాలు ఉంటే కూడా ఇక్కడి నుంచే క్వింటాళ్ల కొద్దీ చికెన్‌ కొనుక్కు వెళ్తుంటారు.

ఇక్కడి మార్కెట్‌లో ప్రతిరోజు 10 నుంచి 15 టన్నుల మధ్య చికెన్‌ విక్రయాలు జరుగుతుంటాయి. ఇక ఆదివారం వస్తే చాలు 40 నుంచి 50 టన్నుల మధ్య చికెన్ విక్రయాలు జరుగుతాయి. పలు పౌల్ట్రీ కంపెనీలు ఇక్కడ హోల్‌సేల్‌గా దుకాణాలకు కోళ్లను సరఫరా చేస్తాయి.

అంతేగాక, ఇక్కడి పలువురు చికెన్‌ సెంటర్ల వారికి సొంతంగానూ పౌల్ట్రీఫాంలు ఉన్నాయి. కామారెడ్డి కేంద్రంలో కార్పొరేట్‌ కంపెనీలకు చెందిన కోళ్ల అమ్మకాలు సైతం అధికంగా జరుగుతాయి.

ఇక్కడి వ్యాపారుల మధ్య పోటీ కూడా బాగా ఉండడంతో పోటీలు పడి తక్కువ ధరకు చికెన్‌ అమ్ముతున్నారు. చికెన్‌ కొనుగోళ్ల కోసం తరుచూ వచ్చే హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్ల వారికి మరింత తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.