Telangana Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా డబ్బులు వేసే డేట్‌ ఇదే..

ముందుగా అనుకున్నట్లు ఒక్కో గ్రామానికి కాకుండా అప్పట్లో చెల్లించినట్లుగానే ఎకరాల చొప్పున విడతల వారీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణచించింది.

Telangana Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా డబ్బులు వేసే డేట్‌ ఇదే..

Rythu Bharosa

Updated On : February 9, 2025 / 8:27 AM IST

తెలంగాణ సర్కారు ఇటీవలే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వాటిని వేర్వేరుగానే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంది.

మండలానికి ఒక గ్రామం చొప్పున ముందుగా అర్హులు అందరికీ నాలుగు పథకాలు అందించాలని ప్రణాళికలు వేసుకుని సాధ్యం కాకపోవడంతో తేలికగా పూర్తయ్యే పథకాలను ముందుగా అమలు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. మిగిలిన వాటిని ఆ తర్వాతే పూర్తి చేయాలని నిర్ణయించి, జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది.

ఫిబ్రవరి తొలి వారంలో ప్రతి గ్రామానికి షెడ్యూల్ వేసి, వచ్చేనెల 31 వరకు అన్ని గ్రామాల్లోనూ పూర్తి చేయాలని ప్రణాళికలు వేసుకున్నారు. కానీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఒక్కో గ్రామంలో పథకం అమలు వంటి వాటితో సమయం వృథా అవుతుందని, దీంతో నాలుగు పథకాల అమలు అంత తేలికగా కావని అధికారులు భావిస్తున్నారు. ఈ కారణంతోనే ఆ నాలుగు పథకాల్లో తొలుత నేరుగా అర్హుల అకౌంట్లకు నిధులు జమ చేసే వాటిని పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది.

ఇప్పటికే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన అర్హుల డేటా సర్కారు వద్ద స్పష్టంగా ఉంది. సాగుకు పనికిరాని భూములు రెండున్నర లక్షల ఎకరాలుగా అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఆ సర్వే నంబర్లను బ్లాక్ చేశారు. ఆ తర్వాత మిగిలిన కోటి 50 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు చేశారు.

ఫిబ్రవరి 10 లేదా 11న జమ
ముందుగా అనుకున్నట్లు ఒక్కో గ్రామానికి కాకుండా అప్పట్లో చెల్లించినట్లుగానే ఎకరాల చొప్పున విడతల వారీగా ఇవ్వాలని సర్కారు నిర్ణచించింది. ఇటీవల ఒక ఎకరా వరకు ఉన్న సుమారు 17 లక్షల మంది రైతులకు నిధులను జమ చేసింది ప్రభుత్వం. రేపు లేదా ఎల్లుండి (ఫిబ్రవరి 10 లేదా 11న) రెండు ఎకరాల వరకు ఉన్న వారికి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వనుంది.

అలాగే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో సర్కారు భూములు లేని వ్యవసాయ కూలీల గణాంకాలను కూడా ప్రభుత్వం తేల్చి, వారి బ్యాంక్ ఖాతాల నంబర్లను సైతం తీసుకుంది. అర్హులకు ఏక కాలంలో నిధులు జమ చేయాలని నిర్ణయించింది. మరోవైపు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా జరగనుంది. ఆన్‌లైన్‌లో రేషన్ కార్డుల వివరాలను తాజాపర్చుతుంటారు.

ఇందిరమ్మ ఇండ్ల విషయంలోనూ లబ్ధిదారుల గుర్తింపు దాదాపు పూర్తయింది. తొలి విడత లబ్ధిదారులు నాలుగున్నర లక్షల మందిని ఫైనల్ చేసేందుకు త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అర్హుల జాబితా ఫైనల్ చేశాక, వారి అకౌంట్లలో తొలి దశలో రూ.లక్ష చొప్పన వేస్తారు.