హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా మార్చడానికి అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే, పలు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు.
హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టును వేగవంతం చేయాలని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి మూసీ వైపు వచ్చే మార్గంలో కొత్వాల్‌గూడ జంక్షన్‌లో దీనికి ప్రతీకగా ఇండియా గేట్, గేట్ వే ఆఫ్ ఇండియా, చార్మినార్ లాంటి ఓ ల్యాండ్ మార్క్‌ను నిర్మించాలన్నారు.
ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని వారసత్వ కట్టడాల సంరక్షణ కోసం కులీకుతుబ్ షాహీ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మార్గదర్శకాలను సవరించాలని, మరింత బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ మెట్రోకు ఇప్పటికే నిధులు విడుదల చేశామని, ఆ పనులు వేగవంతం చేయాలని చెప్పారు.
Also Read: “సృష్టి” ఐవీఎఫ్ సెంటర్ కేసు.. తీగలాగితే దేశవ్యాప్తంగా అక్రమ ఐవీఎఫ్ సెంటర్ల గుట్టురట్టు
మూసీపై బ్రిడ్జి కమ్ బ్యారేజీలకు ప్రణాళికలు రూపొందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూపార్క్ తో పాటు మీరాలం ట్యాంక్ సమీపంలో టూరిస్టులు బస చేయడానికి వీలుగా అధునాతన వసతులతో హోటల్ నిర్మించాలని చెప్పారు.
తదుపరి 25 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లోని సమస్యలను అధ్యయనం చేయాలని సూచించారు.
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, కేబులింగ్‌పై అధికారులు దృష్టిసారించాలని చెప్పారు. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో కాలుష్యం వల్ల తలెత్తున్న సమస్యలు హైదరాబాద్‌లో రాకూడదని అన్నారు. కోర్ సిటీలోని కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ బయటకు తరలించాలని చెప్పారు.
ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను నిషేధించాలని అధికారులకు రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే, హైదరాబాద్‌లో నిర్మాణ రంగం నుంచి వెలువడే వ్యర్థాలను ఇష్టం వచ్చినచోట డంప్ చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి పనులను ఉద్దేశపూర్వకంగా చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీవరేజీ బోర్డు ప్రత్యేక శ్రద్ధ చూపి మంచినీటితో పాటు మురుగు నీటి సరఫరా సిస్టమ్స్‌ను సంస్కరించాలని తెలిపారు.