Indiramma Indlu
Indiramma Indlu: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబం ఇందిరమ్మ హౌసింగ్ స్కీం ద్వారా లబ్ధిపొందేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో పథకంలో భాగంగా తొలి దశలో 71వేల మందికి ప్రభుత్వం ఇండ్ల మంజూరు పత్రాలు అందించింది. రీ వెరిఫికేషన్ సమయంలో 6వేల మందిని అధికారులు అనర్హులుగా గుర్తించారు. దీంతో తొలిదశలో 65వేల మంది అర్హులుగా ఫైనల్ అయ్యారు. వీరిలో ఇప్పటి వరకు 12వేల మంది ఇండ్ల నిర్మాణానికి ముగ్గులు పోసినట్లు, మరో 12వందల మంది బేస్మెంట్ పూర్తి చేసినట్లు అధికారులు నివేదికలు ఇచ్చారు. బేస్మెంట్ పూర్తిచేసుకున్న వారికి వారంరోజుల్లో డబ్బులు రిలీజ్ చేసేలా ప్రభుత్వం దృష్టిసారించింది.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం నాలుగు దశల్లో ఐదు లక్షలు అందించనుంది. బేస్మెంట్ పూర్తయితే తొలి దశలో లక్ష ఇవ్వనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో బేస్మెంట్ పూర్తిచేసిన లబ్ధిదారుల ఖాతాల్లో వారంరోజుల్లో లక్ష రూపాయలు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూన్ కల్లా సుమారు 45వేల ఇండ్ల బేస్మెంట్ తో పాటు గోడలు కట్టే పనులు కూడా పూర్తయ్యేలా అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ ఫాలో అప్ చేయాలని ఇటీవల వీసీలో అధికారులను హౌసింగ్ సెక్రటరీ, ఎండీలు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఇందిమ్మ హౌసింగ్ స్కీంలో భాగంగా మొదటి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసిన ప్రభుత్వం.. ఈసారి ఆ విధానానికి స్వస్తి చెప్పింది. ఇకనుంచి మండలంలోని అన్ని గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఉన్నతాధికారులు కలెక్టర్లను ఆదేశించారు. అర్హులకే పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు ముందు నుంచి చెబుతున్నారు. లబ్ధిదారుల వివరాలను గ్రామ సభల్లో వెల్లడించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో కలెక్టర్లు, ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.