Inter Exams 2025: ఇంటర్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది.. అధికారులు ఏయే ఏర్పాట్లు చేశారో తెలుసా?
పరీక్షలపై నిఘా పటిష్ఠంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

Intermediate
తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంటర్ పరీక్షలకు చేస్తున్న ఏర్పాట్ల గురించి రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళికి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వివరాలు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో మొత్తం కలిపి 8 వేలకిపైగా సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. వీటికి కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సీసీటీవీ కెమెరాలను ఇంటర్ బోర్డులోని కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానం చేశామని చెప్పారు. దీంతో పరీక్షలపై నిఘా పటిష్ఠంగా ఉంటుందని తెలిపారు.
Also Read: గడువు దగ్గరపడుతోంది.. ఇంకా వారం రోజులే ఉన్నాయ్.. రైల్వేలో జాబ్ కోసం అప్లై చేశారా?
సీసీ కెమెరాల పర్యవేక్షణ కోసం దాదాపు 40 మంది సిబ్బందితో తాము ఓ కమాండ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామని అన్నారు. పారదర్శకతే ప్రధాన లక్ష్యంగా వ్యవస్థను పటిష్ఠం చేశామన్నారు. పలువురు అధికారులు ఇప్పటికే పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల వ్యవస్థను తనిఖీ చేశారు. పరీక్షలు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగేలా చూస్తామన్నారు.
ఒత్తిడి తగ్గించుకోవాలి
పరీక్షల వేళ ఒత్తిడి తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చదవడానికి తగినంత సమయం కేటాయించుకోవాలని అంటున్నారు. స్టడీ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ఫాలో కావాలని చెబుతున్నారు.
అలాగే, వీక్లీ రివిజన్ ప్లాన్ చేసుకోవాలి. నిద్ర, ఆహారంపై శ్రద్ధ వహించాలి. రాత్రి సమయంలో కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఒకే ఒక్కరోజులో మొత్తం సిలబస్ చదివేయాలని ప్రయత్నించకూడదు. ధ్యానం, యోగా చేయడం మంచిది.