IPL 2023: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో సేవల సమయం పెంపు.. 60 ప్రత్యేక బస్సులు ..
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో సేవల సమయం పెంపు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీసైతం నగరంలోని అన్ని డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులను నిడపనుంది.

Rajiv Gandhi International Cricket Stadium
IPL 2023: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Rajiv Gandhi International Cricket Stadium) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) మ్యాచ్‌లకు సిద్ధమైంది. గత నెల 31 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కాగా.. ఈ రోజు ఉప్పల్ స్టేడియం (uppal stadium) లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మధ్య మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా ఎంపికైన మార్‌క్రమ్ గైర్హాజరీతో రాజస్థాన్‌తో నేడు జరిగే పోరుకు భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. మ్యాచ్ సందర్భంగా పటిష్ట భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. 1500 మంది పోలీసులను భద్రత విధులకు కేటాయించారు.
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో సేవల సమయం పెంపు చేశారు. క్రికెట్ మ్యాచ్ ను దృష్టిలో ఉంచుకొని మెట్రో రైళ్లను రాత్రి 1గంట వరకు నడపనున్నారు. 3.30 గంటలకు మొదలయ్యే మ్యాచ్ ను చూసేందుకు మధ్యాహ్నం నుంచే ప్రేక్షకులు స్టేడియం చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12.30 గంటల నుంచే ఫ్రీక్వెన్సీని పెంచనున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీసైతం హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే రోజుల్లో నగరంలోని అన్ని డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈనెల 2,9,18, 24 తేదీలతో పాటు మే నెల 4, 13, 18 తేదీల్లో ఉప్పల్ లో మ్యాచ్ లు జరగనున్నాయి. వాటిని తిలకించేందుకు క్రికెట్ అభిమానుల కోసం నగరంలోని అన్ని డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ప్రకటించింది. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ ఈ బస్సులు క్రికెట్ వీక్షకులకు అందుబాటులో ఉంటాయని గ్రేటర్ ఆర్టీసీ జోన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
IPL 2023: జియో సినిమా యాప్ సరికొత్త రికార్డు.. ఒక్క రోజులోనే కోట్లాది డౌన్‌లోడ్‌లు
ఉప్పల్ స్టేడియంలో ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ స్టేడియంలో మొత్తం ఏడు మ్యాచ్ లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 నుంచి జరిగే మ్యాచ్ లకోసం మూడు గంటల ముందు నుంచి స్టేడియంలో అనుమతిస్తారు. రాత్రి సమయంలో జరిగే మ్యాచ్ కోసం సాయంత్రం 4.30 గంటల నుంచి స్టేడియంలోకి అనుమతిస్తారు. వాహనాలపై స్టేడియంకు వచ్చిన ప్రేక్షకులు స్టేడియం వద్ద సూచించిన ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు నేడు జరిగే మ్యాచ్ సందర్భంగా మొత్తం 340 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి పరిశీలనకు ప్రత్యేకంగా జాయింట్ కమాండ్ కంట్రోల్ రూంను పోలీసులు ఏర్పాటు చేశారు.