MLA Jagga Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పొలిటికల్ జర్నీ ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఫైర్‌బ్రాండ్‌గా చెప్పే జగ్గారెడ్డి కొద్దికాలంగా మౌనంగా ఉంటున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ ముఖ్యనేత కేటీఆర్ (KTR)తో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో ఉంటూ స్వపక్షంలో విపక్షం పాత్ర పోషించే జగ్గారెడ్డి.. సడన్‌గా బీఆర్‌ఎస్‌తో (BRS Party) టచ్‌లోకి వెళ్లడంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఆయన త్వరలో గులాబీ గూటికి చేరిపోతారనే చాలా ఎక్కువగానే వినిపిస్తోంది. నిజంగా జగ్గారెడ్డి బీఆర్‌ఎస్‌లోకి జంప్ చేస్తారా? తెరవెనుక రాజకీయం ఏమైనా ఉందా?
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రూటే సపరేటు.. ఆయన ప్రతి యాక్షన్ చాలా డిఫరెంటే. మనవాళ్లు, పరాయవాళ్లన్న బేధమేమీ ఉండదు.. జగ్గారెడ్డికి నచ్చిందే చేస్తారు.. తోచిందే చెప్తారు. సొంత మనుషులను వెనుకేసుకు రావడం జగ్గారెడ్డి చరిత్రలో లేదు. ముక్కుసూటిగా మాట్లాడటం.. ఉన్నది ఉన్నట్లు కుండబద్ధలు కొట్టడమే జగ్గారెడ్డి నైజం. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన జగ్గారెడ్డి.. పీసీసీ చీఫ్ రేవంత్‌తో సరిపడక.. తన పదవికి రాజీనామా చేసేశారు. అంతేకాదు ఈ మధ్య గాంధీభవన్‌వైపే రావడం మానేశారు. ఆయన ఇలా గ్యాప్ తీసుకుంటుండటంతో పార్టీ మారతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
వాస్తవానికి జగ్గారెడ్డికి కాంగ్రెస్ అంటే అమితమైన ప్రేమ. గాంధీ కుటుంబం అంటే ప్రత్యేక అభిమానం. ఈ విషయం ఆయనే స్వయంగా చాలా సార్లు చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గంలో తన పట్టు ఎలాంటిదో చూపెట్టారు జగ్గారెడ్డి. కానీ, కొన్నాళ్లుగా రాష్ట్ర పార్టీ వ్యవహారాలపైనే కినుక వహించారు జగ్గారెడ్డి. ప్రస్తుత రాష్ట్ర నాయకత్వంతో ఎన్నికలకు వెళితే గెలవలేమన్న భావనతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారక తప్పదనే ఆలోచన చేస్తున్నారట జగ్గారెడ్డి.
Also Read: ప్రభుత్వం ఆ పని చేసుంటే సీతక్క కన్నీళ్లు పెట్టుకునేది కాదు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
కొద్దికాలంగా జగ్గారెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్‌లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఆయన బీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం జోరందుకుంది. జగ్గారెడ్డి అడుగులు కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయి. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌తో భేటీ కావడంతో జగ్గారెడ్డి పార్టీ మారతారనే ప్రచారానికి మరింత ఊతం ఇచ్చినట్లైంది. ఇందుకు తగినట్టుగానే కొంతకాలంగా ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయకుండా సైలెంట్ అయ్యారు సంగారెడ్డి ఎమ్మెల్యే.
Also Read: అందరి దృష్టి కోకాపేటపైనే.. అసలు నియోపోలిస్ అంటే అర్థం ఏంటి?
అంతేకాదు వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి బీఆర్ఎస్ టిక్కెట్ కూడా జగ్గారెడ్డికి ఖరారైందనే మరోటాక్ వినిపిస్తుంది. కాంగ్రెస్‌లో స్వేచ్ఛగా ఉండే జగ్గారెడ్డి తమ పార్టీలో చేరికపై బీఆర్‌ఎస్ క్యాడర్ మాత్రం నమ్మడం లేదు. బీఆర్‌ఎస్‌లో జగ్గారెడ్డి ఇమడగలరా? అనే అనుమానాలే ఇందుకు కారణం. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించుకోవడం కోసమే జగ్గారెడ్డి పార్టీలోకి వస్తానని చెబుతున్నారనే అనుమానం కూడా ఉందట. ఏదైనా సరే తెలంగాణ రాజకీయాల్లో జగ్గారెడ్డి వ్యవహారం ఆసక్తికరంగా మారింది.