హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు నగరాల్లోని శ్రీ చైతన్య విద్యాసంస్థల ఆఫీసుల్లో ఐటీ శాఖ రెండో రోజు సోదాలు నిర్వహిస్తోంది. ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలిస్తోంది. నిన్న రూ.2.5 కోట్ల నగదును గుర్తించినట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.
నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జరిపిన సోదాల్లో అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేతకు శ్రీచైతన్య విద్యాసంస్థలు పాల్పడ్డాయన్న విశ్వసనీయ సమాచారంతో ఏకకాలంలో విస్తృతంగా దాడులు జరుపుతున్నారు.
Also Read: బంగారం ధరల్లో ఈ మార్పులు ఎందుకు జరుగుతున్నాయి? మార్కెట్లో ఈ పరిస్థితులకు కారణాలేంటి?
విద్యార్థుల నుంచి అనధికారికంగా భారీ మొత్తంలో ఫీజులు వసూళ్లు చేసి తక్కువ మొత్తంలో పన్ను చెల్లించినట్లు శ్రీచైతన్య విద్యాసంస్థలపై ఆరోపణలు, అభియోగాలు ఉన్నాయి. తెలుగురాష్ట్రాలతో పాటు ఢీల్లీ, పూణే, చెన్నై లోని శ్రీచైతన్య విద్యాసంస్థల కార్పొరేట్ కార్యాలయాలు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.
పలు డాక్యుమెంట్లు, కంప్యూటర్ల హార్డ్ డిస్క్ లు, ల్యాప్ ట్యాప్ లను సీజ్ చేశారు. ఒక్కో బ్రాంచ్ లో జరిగిన అడ్మిషన్లు, వసూళ్లు చేసిన ఫీజులు, ఆదాయ వ్యయాలు, ప్రభుత్వానికి చెల్లించిన పన్నుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
ఐటీ అధికారుల ఆకస్మిక సోదాలతో యాజమాన్యం బెంబేలెత్తుతోంది. ఐటీ అధికారులు సోదాల సమయంలో విద్యాసంస్థల్లో సిబ్బందిని బయటికి వెళ్లనివ్వలేదు. లాగిన్ యాడ్ పాస్ వర్డ్ లతో వివరాలు సేకరించారు. ఖమ్మం వంటి టైర్ టూ సిటీల్లోని శ్రీచైతన్య విద్యాసంస్థల్లో గత అర్ధరాత్రివరకు ఐటీ అధికారుల సోదాలు జరిగాయి.