Jubilee Hills Constituency: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ టికెట్ ఈసారి ఎవరికి.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరు?

గత మూడు ఎన్నికల్లో.. మూడు వేర్వేరు పార్టీలకు పట్టం కట్టిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లు.. ఈసారి ఎవరిని గెలిపిస్తారన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది.

Jubilee Hills Assembly Constituency Ground Report

Jubilee Hills Assembly Constituency: జూబ్లీహిల్స్.. పేరుకే రిచ్ ఏరియా. కానీ.. ఇక్కడ ఓటేసేది మాత్రం బస్తీ వాసులే. 3 సార్లు ఎన్నికలు జరిగితే.. ఒక్కోసారి ఒక్కో పార్టీకి చాన్స్ ఇస్తూ వినూత్న తీర్పు చెప్పారు ఇక్కడి ఓటర్లు. మరి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జూబ్లీహిల్స్ ఓటర్లు ఈసారి ఏ పార్టీకి ఓటేస్తారు.. ఎవరిని తమ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారన్నది ఆసక్తిగా రేపుతోంది. ఇప్పటికే అన్ని పార్టీల నేతలు.. జూబ్లీహిల్స్‌పై ఫోకస్ పెంచేశారు. రానున్న ఎన్నికల్లో.. ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలోకి దిగబోతున్నారు? అధికార బీఆర్ఎస్ టికెట్ ఈసారి ఎవరికి దక్కుతుంది? కాంగ్రెస్ జోరు ఈసారి కనిపిస్తుందా?

2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా.. ఖైరతాబాద్ నుంచి విడిపోయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంగా ఏర్పడింది. ఇక్కడ దాదాపు 2 లక్షల 90 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు 3 సార్లు ఎన్నికలు జరిగితే.. 3 పార్టీలను గెలిపించి విలక్షణ తీర్పు ఇచ్చారు ఇక్కడి ఓటర్లు. మొదటిసారి ఇక్కడి నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి (p vishnuvardhan reddy) గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) విజయం సాధించారు. తర్వాత.. ఆయన గులాబీ గూటికి చేరారు. 2018లో ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మళ్లీ ఆయనే.. బీఆర్ఎస్ (BRS Party) నుంచి గెలిచారు. ఇలా ఒక్కోసారి.. ఒక్కో పార్టీకి అవకాశం ఇస్తూ వస్తున్నారు ఇక్కడి ఓటర్లు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోకి.. ఎర్రగడ్డ (Erragadda), యూసుఫ్‌గూడ, బోరబండ (Borabanda), షేక్‌పేట డివిజన్లతో పాటు శ్రీనగర్ కాలనీ (Sri Nagar Colony) డివిజన్‌లో సగభాగం ఇందులోనే ఉంటుంది. ఇక్కడ నేతల గెలుపోటములను ప్రభావితం చేసేది బస్తీవాసులే. పేరుకు జూబ్లీహిల్స్ (Jubilee Hills) అయినా ఖరీదైన విల్లాలున్నా నియోజకవర్గవ్యాప్తంగా కాలనీలు, బస్తీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న జూబ్లీహిల్స్‌లో దివంగత నేత పీజేఆర్ హవా నడిచేది. ఆయనపై అభిమానంతోనే ఆయన కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగానూ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగానూ.. రెండు సార్లు అవకాశం ఇచ్చారు ఇక్కడి ఓటర్లు.

Maganti Gopinath

బీఆర్ఎస్ విషయానికొస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్.. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా (Hyderabad District) బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వరుసగా రెండు సార్లు గెలవడం వల్ల.. సాధారణంగా ఉండే వ్యతిరేకతకు తోడు.. పార్టీలోనూ గ్రూపులు ఎమ్మెల్యేను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలతోనే.. మరోసారి గెలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో బస్తీ ఓటర్లు ఎక్కువగా ఉండటం.. వారిలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎక్కువగా ఉండటం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు.

Ravula Sridhar Reddy

అయితే.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు వ్యతిరేకంగా గ్రేటర్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ (Baba Fasiuddin) గ్రూపు పనిచేస్తోంది. దీనికి తోడు గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి స్థానికంగా గట్టి పట్టున్న నేతగా పేరున్న రావుల శ్రీధర్ రెడ్డి కూడా కారెక్కేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. దాంతో.. వీళ్లిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. శ్రీధర్ రెడ్డి ఎక్కడ తనకు పోటీగా మారతారోనన్న ఆలోచనలో ఆయనకు చెక్ పెట్టేందుకు.. ఎమ్మెల్యే గోపీనాథ్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ జిల్లా ఆత్మీయ సమ్మేళనాల్లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో.. స్టేజీ మీదే ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికల సమయంలో.. కేటీఆర్ ఆశీస్సులతో.. బీఆర్ఎస్‌లోకి వచ్చిన శ్రీధర్ రెడ్డి కూడా టికెట్ రేసులో ముందున్నారు.

Also Read: ఖైరతాబాద్ లో ఈసారి ఎగరబోయే జెండా ఎవరిది.. ట్రయాంగిల్ ఫైట్‌లో తడాఖా చూపేదెవరు?

Keerthi Reddy BJP

ఇక.. బీజేపీ నుంచి జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్న వాళ్ల సంఖ్య ఎక్కువుంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగినా జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో మాత్రం ఒక్క డివిజన్ కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది. ఇక్కడ మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉండటం కూడా బీజేపీ వెనుకబడి ఉండటానికి కారణమని చెప్పొచ్చు. ప్రస్తుతం.. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన లంకాల దీపక్ రెడ్డి టికెట్ రేసులో ముందున్నారు. అలాగే ప్రముఖ సామాజిక వేత్త కీర్తి రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీరితో పాటు మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ పద్మ కూడా టికెట్ ఆశిస్తున్నారు.

Also Read: రాజాసింగ్ ఇలాఖాలో తడాఖా చూపేదెవరో.. గోషామహల్‌లో గులాబీ జెండా ఎగిరేనా?

p vishnuvardhan reddy

ఇక.. కాంగ్రెస్ నుంచి పీజేఆర్ కుమారు విష్ణువర్ధన్ రెడ్డే టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ రేసులో కోటింరెడ్డి వినయ్ రెడ్డి (Kotimreddy Vinay Reddy) పేరు కూడా వినిపిస్తున్నా కొంతకాలంగా ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. అలాగే.. విష్ణు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే.. పీజేఆర్ కూతురు విజయారెడ్డి సైతం ఖైరతాబాద్ గానీ జూబ్లీహిల్స్ నుంచి గానీ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. దాంతో పీజేఆర్ వారసులైన ఇద్దరికీ.. కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తుందా? ఒకరికి చెక్ పెడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. విజయారెడ్డి రేవంత్ రెడ్డి వర్గంలో ఉండగా.. విష్ణు ఆయన వ్యతిరేక వర్గంలో ఉన్నారు. దాంతో.. కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. గత మూడు ఎన్నికల్లో.. మూడు వేర్వేరు పార్టీలకు పట్టం కట్టిన జూబ్లీహిల్స్ ఓటర్లు.. ఈసారి ఎవరిని గెలిపిస్తారన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది.

ట్రెండింగ్ వార్తలు