Jubilee hills bypoll
Jubilee hills bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అభ్యర్థిని ఖరారు చేసింది. ఆ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన అనారోగ్య కారణాలతో మృతిచెందారు. దీంతో ఆ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. వచ్చేనెలలో ఈ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమతమ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
సిట్టింగ్ స్థానాన్ని మరోసారి తమ ఖాతాలో వేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దీంతో మాగంటి గోపీనాథ్ కుటుంబానికే ఆ స్థానాన్ని కేటాయించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరును బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. మాగంటి సునీత ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారాన్ని మొదలు పెట్టారు.
మరోవైపు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అధికార పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా అభ్యర్థి ఎంపికపై అ పార్టీ అధిష్టానం దృష్టిసారించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో గెలవబోతున్నామని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచేది మేమే. నియోజకవర్గంలో సర్వేలు చేస్తున్నాం. గెలిచే వారికే టికెట్ ఇస్తాం. సామాజిక వర్గం కాదు.. గెలిచే వారికే అవకాశం ఉంటుందని చెప్పారు.