×
Ad

Jubilee Hills Bypoll 2025: బాస్ వచ్చి ఉంటే మరోలా ఉండేదా..? జూబ్లీహిల్స్ ఫలితంపై ఉత్కంఠ.. బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త చర్చ..

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి ఉంటే బాగుండేదన్న చర్చ గులాబీ పార్టీ నేతల్లో జరుగుతోంది.

Jubilee Hills Bypoll 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కు పట్టం కట్టడంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త చర్చ జరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ దే విజయం అని ప్రకటించినప్పటికీ.. 4 నుంచి 7 శాతం లోపే మెజారిటీ ఉండొచ్చనే అంచనాలు ఉండటంతో తమ పార్టీ గెలుపుపై బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆశలు సన్నగిల్లాయి. తమ పార్టీ అధినేత కేసీఆర్.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి వచ్చి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదన్న టాక్ బీఆర్ఎస్ లో వినిపిస్తోంది.

వాస్తవానికి జూబ్లీహిల్స్ ప్రజలు తమవైపే ఉన్నారని, అయితే మరింత పటిష్ట వ్యూహాన్ని అమలు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్న చర్చ బీఆర్ఎస్ లో జరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు చూస్తే కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు మధ్య పెద్ద వ్యత్యాసం ఏమీ లేకపోవడం ఇప్పుడు బీఆర్ఎస్ ను ఆలోచనలో పడేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి ఉంటే బాగుండేదన్న చర్చ గులాబీ పార్టీ నేతల్లో జరుగుతోంది.

అందులో ప్రధానంగా పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వచ్చి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీలో వ్యక్తమవుతోందని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఒక్క రోడ్ షో లో పాల్గొని ప్రసంగించినా.. ఆ ప్రభావం చాలా ఉండేదన్న టాక్ బీఆర్ఎస్ లో వినిపిస్తోంది. అలా కాకపోయినా కనీసం కేసీఆర్ తో జూబ్లీహిల్స్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడించి, ఒక చిన్న వీడియో సందేశం ఇప్పించినా బాగుండేదని అంటున్నారు. కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రచారం చేస్తే కచ్చితంగా 4 నుంచి 5శాతం ఓటర్లు ప్రభావితం అయ్యేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారానికి రాకపోవడాన్ని అధికార కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకుందన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఓటు అడగనప్పుడు వారి అభ్యర్థికి ఓటు వేయాల్సిన అవసరం ఏముందన్న కోణంలో రేవంత్ రెడ్డి లేవనెత్తిన పాయింట్ కాంగ్రెస్ కు కలిసి వచ్చిందనే గుసగుసలు బీఆర్ఎస్ లో వినిపిస్తున్నాయి. ప్రచార సమయంలో తాము గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి వచ్చి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదని చర్చించుకుంటున్నారు అనే టాక్ వినిపిస్తోంది.

Also Read: మంత్రి పదవి అక్కర్లేదు.. సీఎంతో గ్యాప్ లేదు.. అక్కడ ఉపఎన్నిక వస్తుందనుకోవడం లేదు- మహేశ్ గౌడ్