Mahesh Goud: మంత్రి పదవి అక్కర్లేదు.. సీఎంతో గ్యాప్ లేదు.. అక్కడ ఉపఎన్నిక వస్తుందనుకోవడం లేదు- మహేశ్ గౌడ్
తెలంగాణలో కూడా ఓటు చోరీ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు చోరీ చేసి ఎక్కువ సీట్లు గెలిచింది.
Mahesh Goud: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం అని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మంత్రులతో పాటు ఇంఛార్జ్ బాధ్యతలు ఉన్న ప్రతీ ఒక్కరూ బాగా పని చేశారని ఆయన కితాబిచ్చారు. పోలింగ్ పర్సంటేజ్ పెరిగి ఉండాల్సిందన్నారు. పట్టణ ప్రజలు, యువత ముందుకొచ్చి ఓటు వేయాల్సిందన్నారు. ప్రతిపక్షం చేసిన రిగ్గింగ్ ఆరోపణలను మహేశ్ గౌడ్ ఖండించారు. అది పాజిబుల్ కాదన్నారు. ఇది పాత జమానా కాదని చెప్పారు. ఓడిపోతున్నామనే బాధతో బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ లో తమ పార్టీ అభ్యర్థి కూడా తమకు ప్లస్ పాయింట్ గా మారిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పాజిటివ్ వేవ్ కనిపిస్తోందన్న మహేశ్ గౌడ్.. మళ్లీ వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.
”లోకల్ బాడీ ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకెళ్తాం. మరోసారి ఏఐసీసీతో మాట్లాడి.. లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తాం. లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలి. రెండు, మూడు రోజుల్లో అందరం కూర్చొని మాట్లాడి ముందుకు వెళ్తాం. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా చేయాలని అనుకున్నాం. కానీ కేంద్రంలోని బీజేపీ అడుగడుగునా అడ్డు పడుతోంది.
క్యాబినెట్ విస్తరణ సీఎం, పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. పీసీసీ అధ్యక్షుడిగా చాలా సంతోషంగా ఉన్నా. నేను మంత్రి పదవి కావాలని ఎక్కడా అడగడం లేదు. పార్టీలో నేను ఆర్గనైజేషన్ నుంచి వచ్చా. పార్టీ అప్పగించే బాధ్యతను నిర్వర్తిస్తా. మంత్రివర్గంలోకి వెళ్లాలని ఆరాటం పడటం లేదు. నాకు సీఎంతో పాటు మంత్రివర్గం మొత్తం పూర్తి సహకారం అందిస్తున్నారు. నాకు, సీఎంకు ఎలాంటి గ్యాప్ లేదు.
తెలంగాణలో కూడా ఓటు చోరీ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు చోరీ చేసి ఎక్కువ సీట్లు గెలిచింది. నిజామాబాద్ లో ఓటు చోరీ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఓల్డ్ సిటీలో ఆధారాలను ఫిరోజ్ ఖాన్ బయట పెట్టారు. ఖైరతాబాద్ లో ఉపఎన్నిక వస్తుందనుకోవడం లేదు. ఫిరాయింపుల వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉంది. దానం నాగేందర్ మా పార్టీ విధానాలు నచ్చి మాతో తిరుగుతున్నారు” అని మహేశ్ గౌడ్ అన్నారు.
Also Read: కొత్తగా ఇద్దరికి చోటు.. ఒకరిద్దరిపై వేటు? వారు వీరే? తెలంగాణ క్యాబినెట్ ప్రక్షాళన ఎప్పుడంటే?
