ఎర్రబెల్లి దయాకర్, పల్లా రాజేశ్వర్‌కు కడియం శ్రీహరి స్ట్రాంట్ కౌంటర్

పల్లా రాజేశ్వర్ నిప్పు తొక్కిన కోతిలా మాట్లాడుతున్నారని, కేసీఆర్ ఈ దుస్థితికి రావడానికి కారణం పల్లా లాంటి నాయకులే కారణమని ఆరోపించారు.

Kadiyam Srihari: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన తన కుమార్తె కావ్యతో కలిసి వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తనపై బీఆర్ఎస్ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారి స్థాయికి దిగజారబోనని అన్నారు. అహంకారపు, బలుపు మాటలు తగ్గించుకోవాలని సూచించారు. మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నా ఎర్రబెల్లికి సిగ్గనిపిస్తలేదని, ఇప్పటికైనా కళ్లు తెరవాలని అన్నారు. నేను కూడా ఓడిపోతే బాగుంటుందన్న కడుపుమంటతో ఉన్నారని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అంటే తనకు గౌరవం ఉందన్నారు.

మీ అందరి చరిత్రలు నాకు తెలుసు
పల్లా రాజేశ్వర్ నిప్పు తొక్కిన కోతిలా మాట్లాడుతున్నారని, కేసీఆర్ ఈ దుస్థితికి రావడానికి కారణం పల్లా లాంటి నాయకులే కారణమని ఆరోపించారు. ”నా దోపిడీ అంతా బయటపెడతా అని పల్లా అంటున్నారు. ఎన్నికలకు ముందు చేస్తే మీకు ఉపయోగపడుతుంది. ఆధారాలతో బయటపెట్టకపోతే నీ బట్టలు ఊడదీసుడు ఖాయం. రసమయి బాలకిషన్.. ఘోరంగా ఓడిపోయినా సిగ్గురాలేదు. నా దగ్గరికి వచ్చి చావు డప్పు కొట్టేంత సీన్ ఉందా? మీ అందరి చరిత్రలు నాకు తెలుసు. అవన్నీ నేను బయటపెడితే తిరగలేరు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నట్టు నిరూపించగిలితే నేను, నా కుమార్తె పోటీ నుంచి తప్పుకుంటాం. కడియం శ్రీహరి నిజాయితీకి మారు పేరు. తప్పుడు పనులు ఎన్నడూ చేయన”ని కడియం శ్రీహరి అన్నారు.

దండోరా ముసుగు తీసేయ్.. మందకృష్ణకు కడియం సలహా
బీజేపీకి ఓటు వేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ప్రచారం చేయడంపై కడియం శ్రీహరి స్పందిస్తూ.. దండోరా ముసుగు తీసేయాలని, బీజేపీలో చేరి ఓటు వేయమని అడగాలని సూచించారు. మందకృష్ణ తప్పుడు విధానాలతోనే ఎమ్మార్పీఎస్ బలహీనపడిందని విమర్శించారు. అంబేద్కర్ వాదాన్ని వదిలిపెట్టిన ఆయనను రాబోయే రోజుల్లో దళిత సమాజం క్షమించదని వ్యాఖ్యానించారు. తాను ఎవరి అవకాశాలను దెబ్బతీయలేదని, అవకాశాలే తనను వెతుక్కుంటూ వచ్చాయని చెప్పారు.

Also Read: తెలంగాణలో వలసల రాజకీయం.. టికెట్లు కన్ఫామ్ చేశాక కూడా కండువాలు మార్చడం ఏంటి?

బీజేపీని ప్రాంతీయ పార్టీలు ఎదుర్కొలేవు
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుందని కడియం శ్రీహరి ఆరోపించారు. 400 సీట్లలో గెలిస్తే కాషాయ పార్టీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్లుగా కేంద్రంలో వ్యవస్థలను బీజేపీ నాశనం చేసిందని దుయ్యబట్టారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఎదుర్కొలేవని అభిప్రాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు