బీఎస్పీతో కలిసి పోటీ చేస్తాం.. సీట్ల పంపకాలపై త్వరలో క్లారిటీ: కేసీఆర్

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు తెలంగాణ‌లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్సీ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.

KCR, RS Praveen Kumar: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఎస్పీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ లోని తన నివాసంలో బీఎస్పీ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో రేపు మాట్లాడనున్నట్టు వెల్లడించారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను కలవడం ఆనందంగా ఉందని, తమ రెండు పార్టీల పొత్తును తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని అన్నారు. తమ పార్టీ అధినేత్రి మాయావతితో మాట్లాడిన తర్వాతే తాను బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు ప్రతిపాదన పెట్టానని వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో రాజ్యాంగానికి ముప్పు పొంచివుందని ఆరోపించారు. బీఎస్సీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయని ప్రకటించారు. తెలంగాణను కాపాడేందుకే పొత్తు పెట్టుకుంటున్నామని అన్నారు. సీట్ల సద్దుబాటు విషయంలో తమ పార్టీ అధిష్టానాన్ని సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప్రవీణ్ కుమార్ పెద్దపల్లి నుంచి పోటీ చేయొద్దా?
ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తారా అని కేసీఆర్‌ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన తనదైన శైలిలో స్పందించారు. పెద్దపల్లి నుంచి పోటీ చేయొద్దా? వరంగల్ నుంచి ఎందుకు పోటీ చేయకూడదు. ప్రవీణ్ కుమార్ బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఎక్కడైనా పోటీ చేయొచ్చు దానిదేముంది. జనరల్ సీటులోనైనా పోటీ చేయొచ్చని సమాధానం ఇచ్చారు. ఇతర పార్టీలు ఏమైనా కలిసివచ్చే అవకాశముందా అని అడగ్గా.. చూద్దాం ఏం జరుగుతాదో అని జవాబిచ్చారు.

Also Read: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు ఖరారు

ట్రెండింగ్ వార్తలు