MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత వ్యవహారం బీఆర్ఎస్ లో పెను సంచలన రేపిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కు కవిత లేఖ రాయడం, అది లీక్ కావడం, దానిపై కవిత సీరియస్ గా స్పందించడం.. ఇలా అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆమె కొత్త రాజకీయ పార్టీ పెడతారనే టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవితతో రాజీ ప్రయత్నాలు మొదలు పెట్టింది బీఆర్ఎస్.
బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు కవిత ఇంటికి వెళ్లారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్, ప్రముఖ అడ్వకేట్ గండ్ర మోహన్ రావు కూడా ఉన్నారు. సాయంత్రం కవితతో భేటీ అయ్యారు దామోదర్ రావు. ఈ మధ్య జరిగిన అన్ని పరిణామాలపై కవితతో దామోదర్ రావు చర్చించినట్లు సమాచారం. దాదాపు రెండున్నర గంటలు కవితతో పలు అంశాలపై చర్చించారట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో దామోదర్ రావు కవిత ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.
Also Read: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు.. కేటీఆర్ కి మరోసారి ఏసీబీ నోటీసులు
కొన్ని రోజుల క్రితం కవిత తన తండ్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కి అంతర్గతంగా ఒక లేఖ రాశారు. అయితే ఆ లేఖ బహిర్గతమైంది. అంతే.. ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. కవిత రాసిన లేఖ బయటపడటంతో బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలున్నాయన్న విషయం స్పష్టమైందని కాంగ్రెస్, బీజేపీ వ్యాఖ్యానించాయి. కవిత లేఖను ఆధారంగా చేసుకుని బీఆర్ఎస్ ను టార్గెట్ చేశాయి ఆ రెండు పార్టీలు.
ఇటీవలే అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన కవిత.. కేసీఆర్ కు తాను లేసిన రాఖ వివాదంపై స్పందించారు. తన తండ్రికి తానే లేఖ రాశానని ఆమె చెప్పారు. అంతర్గతంగా ఉంచాల్సిన విషయాన్ని బహిర్గతం చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలో కేసీఆర్ దేవుడే..కానీ, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కవిత. అంతేకాదు పార్టీలో కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలా కవిత వ్యవహారం బీఆర్ఎస్ లో ప్రకంపనలు రేపింది. కవిత బీఆర్ఎస్ ను వీడనున్నారనే ప్రచారం జోరందుకుంది.