Khairatabad Ganesh 2023
Khairatabad Ganesh 2023 : గణేశ్ ఉత్సవాలకు ఖైరతాబాద్ మహా వినాయకుడు సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది 63 ఎత్తులో శ్రీ దశ మహా విద్యాగణపతి రూపంలో ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. రేపు (సెప్టెంబర్ 18) ఉదయం 11 గంటలకు తొలి పూజతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ ఉత్సవాలు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే. ఇక్కడ కొలువుదీరే భారీ గణనాథుడు చాలా ప్రత్యేకం. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా ఖైరతాబాద్ లో గణేశ్ ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. గణేశ్ ఉత్సవాలకు ఖైరతాబాద్ గణనాథుడు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాడు. రేపటి నుంచి గణేశ్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది విభిన్న ఆకారంలో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఇవ్వనున్నారు.
” 1954లో ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఏడాది 69వ సంవత్సరం. ఈ ఏడాది దశమహా విద్యాగణపతిగా వినాయకుడు దర్శనం ఇవ్వబోతున్నారు. విగ్రహానికి ఒకవైపు పంచముఖ లక్ష్మీనరసింహ స్వామి, మరొకవైపు వీరభద్ర స్వామి, వారాహి అమ్మవారు, సరస్వతి మాత వెలిశారు. విగ్రహం ఎత్తు 63 అడుగులు.
దాదాపు 150 మంది కళాకారులు 100 రోజులు శ్రమించి ఈ సుందరమైన విగ్రహాన్ని తయారు చేశారు. లక్ష్మీనరసింహ స్వామిని పూజించడం వల్ల అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీరభద్రుడిని పూజించడం వల్ల ధైర్యం వస్తుంది. వారాహి అమ్మవారిని పూజించడం వల్ల ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వరిగడ్డి, వరిపొట్టు, ఇసుక, వైట్ క్లాత్ ఇవన్నీ విగ్రహ తయారీలో ఉపయోగించాము. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా విగ్రహాన్ని తయారు చేశాము. విగ్రహ తయారీకి 90లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది.
Also Read..Ganesh Chaturthi 2023 : భక్తిశ్రద్ధలతో గణపతిని ఈ విధంగా పూజించండి.. సకల శుభాలు పొందండి
తమిళనాడు నుంచి కళాకారులు వచ్చారు. వారికి రోజుకి 3వేలు ఇచ్చాము. వారికి మొత్తం రూ.20లక్షలు ఇచ్చాము. ఒడిశా నుంచి కళాకారులు వచ్చారు. వారికీ ఇచ్చాము. మొత్తంగా వినాయకుడి విగ్రహం తయారీకి 80 నుంచి 90లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. భక్తులు ఇచ్చే కానుకల వల్లే ఈ ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహించగలుగుతున్నాం” అని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధి తెలిపారు.