×
Ad

Cyber Crime: భారీ సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టు.. రూ.547 కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లు.. సంచలన విషయాలు చెప్పిన ఖమ్మం పోలీసులు

ప్రజల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని అనధికారిక లావాదేవీలు జరిపారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ తో పాటు సహకరించిన 18మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.

Khammam Cyber Crime Representative Image (Image Credit To Original Source)

 

  • విదేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తూ సైబర్ మోసాలు
  • నిరుద్యోగుల పేరు మీద బ్యాంకు ఖాతాలు
  • ప్రధాన నిందితుల్లో సత్తుపల్లి, కల్లూరు, వేంసూర్ మండలానికి చెందిన వారు

Cyber Crime: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో భారీ సైబర్ క్రైమ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 547 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్తులతో కలిసి మోసం చేస్తున్నట్లుగా గుర్తించారు. విదేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నట్లుగా సత్తుపల్లి పోలీసులు తేల్చారు. ప్రజల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని అనధికారిక లావాదేవీలు జరిపారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ తో పాటు సహకరించిన 18మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.

నిరుద్యోగులే టార్గెట్..

ఈ సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ కు సంబంధించి వీ.ఎం.బంజర్ పోలీస్ స్టేషన్ లో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మీడియాతో మాట్లాడారు. సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడి కోట్ల రూపాయలు కాజేసిన కేసులో పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు. ”నిందితులు నిరుద్యోగులను టార్గెట్ చేసుకున్నారు. ఉద్యోగాల పేరుతో వారిని నమ్మించారు. వారి పేరు మీద బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి సైబర్ క్రైమ్ లకు పాల్పడ్డారు.

రూ.547 కోట్లు సంపాదించారు..

సైబర్ క్రైమ్ ద్వారా 547 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారు నిందితులు. సైబర్ క్రైమ్ ముఠాలో సత్తుపల్లి, కల్లూరు, వేంసూర్ మండలానికి చెందిన ఆరుగురు ప్రధాన నిందితులు ఉన్నారు. పోట్రు మనోజ్ కళ్యాణ్, ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు ప్రవీణ్, మేడా భానుప్రియ, మేడా సతీష్, మోరంపూడి చెన్నకేశవను అరెస్ట్ చేశాం. గత ఏడాది డిసెంబర్ లో విఎం బంజర్ పోలీస్ స్టేషన్ లో సాయికిరణ్ అనే వ్యక్తి ఫిర్యాదుతో కోట్ల రూపాయల సైబర్ క్రైమ్ కేసు వెలుగు చూసింది.

బ్యాంకు ఖాతాలు ఇచ్చిన 17మంది పై కేసులు..

నిందితులకు తమ బ్యాంక్ అకౌంట్లను ఇచ్చి సహకరించిన మరో 17 మందిపై కేసులు నమోదు చేశాము. నిందితులు అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్తులతో కలిసి కాల్ సెంటర్లు నిర్వహిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మ్యాట్రిమోనీ, రివార్డ్ పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో మోసాలు చేస్తున్నారు. నేరస్తుల బ్యాంకు ఖాతాలపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదయ్యాయి” అని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.

Also Read: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఇక ప్రతి వారం

సాయికిరణ్ ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి భారీ సైబర్ మోసం..
2025 డిసెంబర్ 24న సాయికిరణ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భారీ సైబర్ మోసం బయటపడింది. ఆ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసి కొంతమంది దగ్గర బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్నారు.

వారి బ్యాంకు అకౌంట్లలో వందల కోట్లు జమ..

వారి బ్యాంకు ఖాతాల ద్వారా భారీ స్థాయిలో సైబర్ క్రైమ్ కు పాల్పడ్డారు. కల్యాణ్ ఖాతాలో 114 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. కల్యాణ్ భార్య భానుప్రియ బ్యాంకు అకౌంట్ లో 40 కోట్లు జమ అయ్యాయి. కల్యాణ్ బావమరిది సతీశ్ బ్యాంకు అకౌంట్ లో 130 కోట్లు జమ అయినట్లు పోలీసులు గుర్తించారు. నాగలక్ష్మి బ్యాంకు అకౌంట్ లో 80 కోట్లు జమ అయ్యాయి. మొత్తం 547 కోట్ల రూపాయల సైబర్ ఫ్రాడ్ చోటు చేసుకుంది. కంబోడియాలో ఉన్న ఏజెంట్లకు డబ్బులు ట్రాన్సఫర్ చేసినట్లుగా గుర్తించారు. ఒకో వ్యక్తి నుంచి 10 వరకు బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్నారు.

కంబోడియాలో ఉన్న కాల్ సెంటర్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడ్డారు. ఈ మోసం నేపథ్యంలో పోలీసులు పౌరులను హెచ్చరించారు. ఇతరులకు తమ బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వడం నేరం అని చెప్పారు. సైబర్ క్రైమ్ లో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసుని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. లోతుగా దర్యాఫ్తు చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు విచారణ జరుపుతున్నారు.