Komatireddy Venkat Reddy
Telangana Congress Komatireddy Venkat Reddy : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరుతున్నానని ప్రకటించారు. ఈ విషయంపై నల్లగొండలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా..తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తనకు తెలియదని ఆ విషయం గురించి నాతో మాట్లాడలేదని అన్నారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డే కాదు చాలామంది కాంగ్రెస్ లో చేరుతున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..అందుకే కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు. తమను ఆదరిస్తున్న నల్లగొండ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడి ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని..ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. మధ్యాహ్నం స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉందని తెలిపిన వెంకట్ రెడ్డి అభ్యర్ధుల సెకండ్ లిస్ట్ ఈరోజు పూర్తవుతుందని..లిస్టు రేపు విడుదల అవుతుందని వెల్లడించారు. తెలంగాణలో ఆరు స్థానాల్లో మాత్రమే తమకు ఇబ్బందులు ఉన్నాయని..ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారని తెలిపారు.మొత్తం 119 సీట్లపై రేపు ఉదయం ప్రకటన వెలువరిస్తామని తెలిపారు.సీఈసి ఫైనల్ అయ్యేవరకు బయట మాట్లాడకూడదన్నారు.
అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తామని అన్నారు.ఈ సందర్భంగా కోమటిరెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని దానిపై విచారణ జరపాలని కోరుతు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశానని తెలిపారు. అలాగే ఈ ఎన్నికల్లో వామపక్షాలకు కాంగ్రెస్ కేటాయించే సీట్ల విషయంపై కూడా మాట్లాడుతు…వామపక్షాలకు నాలుగు సీట్లు అంటే తక్కువేమీ కాదన్నారు.మిర్యాలగూడలో కూడా అడిగారని..కానీ అక్కడ వారి ఓటు బ్యాంకు ఎంత వరకు ట్రాన్సఫర్ అవుతుందనేది చూడాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ 70 – 80 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు.పొత్తులపై సాయంత్రం క్లారిటీ వస్తుందన్నారు. రాహుల్ గాంధీపై కేటీఆర్ చేస్తున్న విమర్శలపై ఈసందర్భంగా కోమిరెట్టి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.రాహుల్ గాంధి పేరు చెప్పే అర్హత కేటీఆర్ కి లేదన్నారు.రాహుల్ గాంధీ కుటుంబానికి ఇల్లు కూడా లేదు..కానీ ఇప్పుడు కేటీఆర్ ఆస్తులు ఎంతున్నాయో అందరికి తెలుసన్నారు. మీ ఆస్తులు ఎంత కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. కాగా నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు భారీగా కాంగ్రెస్ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఆయన నల్లగొండ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు.