Komati Reddy Rajagopal Reddy : బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అమిత్ షాకు రుణపడి ఉంటానని వెల్లడి

కేసీఆర్ కుటుంబం దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Komati Reddy Rajagopal Reddy : బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అమిత్ షాకు రుణపడి ఉంటానని వెల్లడి

Komati Reddy Rajagopal Reddy

Komati Reddy Rajagopal Reddy Resignation : అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ ను గద్దె దించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అనుకుని ఆ పార్టీ చేరడం జరిగిందని, కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా మారడంతో తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నానని తెలిపారు. మరో ఐదు వారాల్లో కేసీఆర్ పాలన అంతం కాబోతోందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎల్లుండి ఢిల్లీలలో రాహుల్ గాంధీ, ఖర్గే సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

Also Read : Eatala Rajender : కేసీఆర్ పైసల్ని,దుర్మార్గాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు .. నాదిప్పుడు చావో రేవో పరిస్థితి : ఈటల రాజేందర్

రాజగోపాల్ రెడ్డి ప్రకటన ప్రకారం..
కేసీఆర్ కుటుంబం దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను భావిస్తున్నారు. అందుకే నేను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read : Gutta Sukhender Reddy : తెలంగాణాకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష : గుత్తా సుఖేందర్ రెడ్డి

బీజేపీకి ధన్యవాదాలు.. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా..
తప్పనిసరి పరిస్థితుల్లోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. మునుగోడు ఉపఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా ఆశీస్సులతో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి అధికార బీఆర్ఎస్ ను ఓడించినంత పని చేశాను. మునుగోడు ఉపఎన్నిక ద్వారా నాకు నియంతృత్వ కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేసే అవకాశం కల్పించిన బీజేపీకి ధన్యవాదాలు. కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేయాలని ప్రోత్సహించిన కేంద్ర మంత్రి అమిత్ షాకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలంగాణ ప్రజల ఆలోచనల మేరకు పార్టీ మారాలని నేను తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ పెద్దలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. నాడు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినా, నేడు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి మారుతున్నా లక్ష్యం మాత్రం ఒకటే. కేసీఆర్ కుటుంబ అవినీతి, అరాచక, అప్రజాస్వామిక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమేనని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.