Komatireddy Venkat Reddy : నకిరేకల్ ఎమ్మెల్యే టికెట్ వారికే- వేముల వీరేశంను ఉద్దేశించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు నా కల ఆగం చేశారు. శాంతియుత నకిరేకల్ కోసం అందరూ అలోచించి నిర్ణయం తీసుకోవాలి. Komatireddy Venkat Reddy - Nakrekal

Komatireddy Venkat Reddy
Komatireddy Venkat Reddy – Nakrekal : నకిరేకల్ నియోజకవర్గం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు ఎవరి పేరు చెబితే వారినే నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో నకిరేకల్ నియోజకవర్గంలో కార్యకర్తలతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. అందరితో మాట్లాడలేకపోయాను అన్నారాయన. వేముల వీరేశంపై నిర్ణయం 28కి వాయిదా వేశారు, మీ నిర్ణయమే ఫైనల్ అని కార్యకర్తలతో చెప్పారు. నకిరేకల్ నా ప్రాణం అన్నారు కోమటిరెడ్డి.
మీరు భాదపడొద్దు, నియోజకవర్గాన్ని బతికించుకోవాలనే నా ఆరాటం అని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో మెజారిటీ నాయకులు, కార్యకర్తలు సూచించిన వ్యక్తికే ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందన్నారు కోమటిరెడ్డి. ఈ సందర్భంగా ఎవరో వస్తే గెలుస్తారని అనుకోవద్దు అంటూ పరోక్షంగా వేముల వీరేశంపై కౌంటర్ వేశారు కోమటిరెడ్డి.
”మీకు కోమటిరెడ్డి ఉంటే కొండంత అండ ఉన్నట్టే. నకిరేకల్ లో 2014, 2018లో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరూ ఇద్దరే. నకిరేకల్ గురించి నిద్ర పట్టడం లేదు. గతంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే కేసీఆర్ తీసుకపోయారు. మళ్ళీ గెలిపించినా పార్టీ మారని వారినే సూచించాలి. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు నా కల ఆగం చేశారు. శాంతియుత నకిరేకల్ కోసం అందరూ అలోచించి నిర్ణయం తీసుకోవాలి” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
”బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తే కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోవడం వల్లే అవతలి వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కార్యకర్తలు ఎవరి పేరు చెబితే వారినే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తాం. మరో వారం రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారవుతారు. కేసీఆర్ ప్రభుత్వంలో చాలామందికి రైతుబంధు అందలేదు. ప్రభుత్వం ఎనిమిదిన్నర గంటలు మాత్రమే కరెంట్ ఇస్తోంది. ఈసారి కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని స్థానాలకు అభ్యర్థులు ఉన్నారు, కొత్తగా ఎవరూ చేరాల్సిన అవసరం లేదు” అని కోమటిరెడ్డి తేల్చి చెప్పారు.
Also Read..BRS Leaders Comments: అత్యుత్సాహం ప్రదర్శిస్తే హాట్‌టాపిక్‌గా మారడం ఖాయం!