Konda Murali
Konda Murali : మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఎపిసోడ్ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంటు కంపెనీల యాజమాన్యాలను సుమంత్ బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కాలుష్య నియంత్రణమండలి (పీసీబీ)లో ఓఎస్డీగా నియమితులై.. డిప్యుటేషన్ మీద అటవీ, దేవాదాయ మంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ ను తొలగిస్తూ మంగళవారం పీసీబీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ గాయత్రిహిల్స్ లోని మంత్రి సురేఖ నివాసంలో సుమంత్ ఉన్నారని సమాచారంతో మఫ్టీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సుమంత్ పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లారు. కొండా సురేఖ కుమార్తె సుస్మిత వారిని ఇంట్లోకి అనుమతించలేదు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న మంత్రి సురేఖ, సుమంత్ బయటకు వచ్చి ఒకే కారులో వెళ్లిపోయారు. తొలుత మినిస్టర్స్ క్వార్టర్స్ లోని పొన్నం ఇంటికి వెళ్లిన కొండా సురేఖ.. పొన్నం లేకపోవడంతో మిగిలిన మంత్రులను కలిసే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి ఆమె వరంగల్ వెళ్లారు. కావాలని తమపై కుట్ర చేస్తున్నారని కొండా ఫ్యామిలీ ఆరోపిస్తోంది.
Also Read: Konda Surekha: మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా.. మాజీ ఓఎస్డీ అరెస్ట్ కు పోలీసుల ప్రయత్నం
కొండా సురేఖ ఇంటి వద్ద అర్ధరాత్రి సమయంలో హైడ్రామా అనంతరం కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి ఉన్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ కూడా ఉందంటూ అన్నారు. కొండా మురళి చెబితేనే నేను బెదిరించానని సుమంత్ తో పోలీసులు తెల్లకాగితంపై రాయించి, ఆ తరువాత మా నాన్నను అరెస్టు చేస్తారని, ఇప్పటికే మా నాన్నకు గన్ మెన్ ను తొలగించారని, మాజీ మావోయిస్టు అయిన కొండా మురళికి రక్షణ కొనసాగించకుండా గన్ మెన్లను ఎందుకు తొలగించారంటూ సుస్మిత ప్రశ్నించారు. అయితే, కుమార్తె సుస్మిత వ్యాఖ్యలపై కొండా మురళీ గురువారం ఉదయం మీడియా సమావేశంలో స్పందించారు.
కొండా మురళి ఏమన్నారంటే..
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం తనకేమీ తెలియదని కొండా మురళి అన్నారు. మంత్రి సురేఖ చాంబర్‌కు నేను వెళ్లలేదని అన్నారు. హైదరాబాద్ లో ఏం జరుగుతుందో నాకు తెలియదు.. సుమంత్ వ్యవహారంలోనూ ఏం జరుగుతుందో తెలియదని చెప్పారు. కుమార్తె సుస్మిత వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నా బిడ్డకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. తాను ఇబ్బంది పడ్డానని చెప్పింది. అందుకే అలా మాట్లాడి ఉంటుంది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని నేను, సురేఖ కష్టపడ్డాం. నాకు ఎమ్మెల్సీ ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తప్పకుండా ఇస్తారు కూడా. సీఎం రేవంత్ రెడ్డికి మాకు మధ్య ఎలాంటి విబేధాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే మాకు సంబంధం లేదు. నేను మంత్రుల వద్దకు వెళ్తాను.. అందరి ఇళ్లకు వెళ్లి మాట్లాడే సాన్నిహిత్యం నాకు ఉంది. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డితో సమస్యపై మాట్లాడతా. మీనాక్షి నటరాజన్ ను కలిసి అన్ని విషయాలను ఆమెకు వివరిస్తానని కొండా మురళి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మా ఇంటికి వచ్చారు. నన్నెందుకు టార్గెట్ చేస్తారు..? వేం నరేందర్ రెడ్డి నేను కామన్‌గా కలుస్తుంటాం అని కొండా మురళి చెప్పారు.