Kotha Manohar Reddy Allegations On Revanth Reddy Update
Kotha Manohar Reddy – Revanth Reddy : ఎన్నికల వేళ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి మోనార్క్ లా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పార్టీలో టికెట్ కి డబ్బులు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోందన్నారు.
ప్రజల్లో ఆదరణ చూసి కుట్రలు..
ఈ మనీ మ్యాటర్ పై ప్రజలు చర్చించుకునే అంశాన్ని పీసీసీ దృష్టికి తీసుకెళితే తనకు సమయం ఇవ్వలేదన్నారు. పైగా తననను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని మనోహర్ రెడ్డి వాపోయారు. తన ఎదుగుదలను, ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి కుట్రలు చేశారని మనోహర్ రెడ్డి మండిపడ్డారు.
మహేశ్వరం టికెట్ పై ఎన్నో ఆశలు..
మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కొత్త మనోహర్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. జూలై 2న కొత్త మనోహర్ రెడ్డి బీఆఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఖమ్మం సభ వేదికగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ పై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా పని చేసుకుంటూ వెళ్లారు.
పారిజాత నరసింహా రెడ్డికి టికెట్ వస్తుందని ప్రచారం..
2014లో బీఆర్ఎస్ గుర్తుపై పోటీ చేసిన మనోహర్ రెడ్డి.. ఆ తర్వాత అవకాశం రాకపోవడంతో సైలెంట్ గా ఉన్నారు. కాంగ్రెస్ లో చేరి మళ్లీ ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ, అక్కడ బడంగ్ పేట్ మున్సిపల్ మేయర్ గా ఉన్న చిగిరింత పారిజాత నరసింహా రెడ్డికి టికెట్ వస్తుంది అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కొత్త మనోహర్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు.
టికెట్ కోసం 5 ఎకరాలు, 10కోట్లు?
పారిజాత నరిసంహా రెడ్డి నుంచి రూ.10 కోట్లు, 5 ఎకరాల భూమి తీసుకుని టికెట్ కన్ ఫర్మ్ చేశారని రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని మనోహన్ రెడ్డి ఓపెన్ గానే కామెంట్స్ చేశారు. 4 రోజుల క్రితం కొత్త మనోహర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు నరసింహా రెడ్డి.. కొత్త మనోహన్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన తర్వాత మీడియా ముందుకొచ్చిన కొత్త మనోహర్ రెడ్డి.. మళ్లీ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డిని ఓడిస్తా..
దీనిపై నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోందని, ఈ ఆరోపణల విషయంలో రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేసి తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కొత్త మనోహర్ రెడ్డి సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి ఎక్కడ పోటీ చేసినా అక్కడ ఆయనపై పోటీ చేసి ఓడించే ప్రయత్నం చేస్తానని మనోహర్ రెడ్డి అన్నారు. మహేశ్వర నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థిపైనా తాను పోటీ చేస్తానని మనోహర్ రెడ్డి ప్రకటించారు. మొత్తంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొత్త మనోహర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారాయి.
కాంగ్రెస్ లో కలకలం..
రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొత్త మనోహర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రత్యర్థి పార్టీలు రాజకీయ అస్త్రంగా మలుచుకునే ప్రయత్నంలో పడ్డాయి. కొత్త మనోహర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ని, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ.. మళ్లీ కొత్త మనోహర్ రెడ్డి చేసిన సవాల్ కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీసింది.